దాడులు ఆగాలంటే బిల్లు పాస్ చేయండి: కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి వస్తున్న సమైక్య ఉద్యమకారులు హింసాత్మక ఘటనలకు తెగబడే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం అందుతోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. వారు దాడులకు పాల్పడకుండా తమకు తెలిసిన విషయాలను ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఇచ్చామన్నారు. ఆధిపత్యం కోసం సీమాంధ్ర నాయకులు ఓవైపు దాడులకు పాల్పడుతుంటే, మరోవైపు తెలంగాణ ఏర్పడదేమోనన్న ఆవేదనతో తెలంగాణ విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇవన్నీ ఆగాలంటే తెలంగాణ బిల్లును కాంగ్రెస్, బీజేపీలు త్వరగా పాస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలోని ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నివాసంలో జరిగిన టీజేఏసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు స్పీకర్‌పైనే పెప్పర్ చల్లేందుకు వెనుకాడని కొందరు సీమాంధ్ర ఎంపీలు డబ్బులతో మిగతా ఎంపీలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఢిల్లీలో ధర్నాకు వచ్చే ఏపీఎన్జీవో, వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని దేవీప్రసాద్ ఆరోపించారు.
లోక్‌సభలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరువుతీసిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ వారసులు కొందరు ఢిల్లీకి పయనమయ్యారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు సీమాంధ్ర నాయకులే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకుంటే హైదరాబాద్ అగ్గి అవుతుందని ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారులు దోచుకున్నారని, యూటీ చస్తే పూర్తిగా లూటీ అవుతుందని అన్నారు. సీమాంధ్రులు ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టుకుంటే తెలంగాణ వాళ్లు పాన్‌డబ్బాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. లోక్‌సభలో పథకం ప్రకారమే సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారని చెప్పారు. తాము కూడా దౌర్జన్యాలకు దిగదలచుకుంటే వారు ఉండరని హెచ్చరించారు. లోక్‌సభలో బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారని, వారు అన్నంత పనీ చేస్తారేమోనని అడ్డుకోబోయామని చెప్పారు. తాము ఎవరిపైనా దాడులు చేయలేదన్నారు.