సాక్షి, న్యూఢిల్లీ: కంతనపల్లి సాగునీటి ప్రాజెక్టు టెండర్లను హడావుడిగా ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. ‘‘ఈ ప్రాజెక్టులో ముఖ్యమంత్రికి ముట్టిందెంత? హడావుడిగా జీవోలు జారీచేయడంలో అసలు ఉద్దేశాలు ఏమిటీ?’’ అని ప్రశ్నించారు. ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, రాపోలు ఆనందభాస్కర్, నంది ఎల్లయ్యలు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలు ఈ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎలా తీసుకుంటారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇలాంటి అడ్డగోలు జీవోలను రద్దు చేస్తామని చెప్పారు. ఉదయం ఎంపీలు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విభజన ప్రక్రియను ప్రక్రియను ఆలస్యంచేసిన కొద్దీ సీమాంధ్రలో ఉద్యమం మరింత తీవ్రమతుందని, ఈ దృష్ట్యా వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.