..అలా ముందుకు వెళదాం: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వస్తున్నా మీకోసం, తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ గ్రాఫ్ పెరక్కపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను నమ్మించేందుకు చాలా శ్రమపడుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలతో గురువారం తన నివాసంలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. పార్టీకి మంచి భవిష్యత్తే ఉంటుందని, తనను నమ్మాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా తనను అర్థం చేసుకున్నారని తెలిపారు. మా లేఖ వల్లనే తెలంగాణ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
అలాగే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత నేతలు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలోనూ పార్టీ వెనకబడిపోయిందని నేతలు ప్రస్తావించగా... రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉభయ ప్రాంతాల నేతలందరినీ త్వరలోనే ఢిల్లీకి తీసుకెళతానని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి విషయాలను వారి దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు. శుక్రవారం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని శనివారం ఉమ్మడి సమావేశంలో పరిష్కారమార్గాలు సూచిస్తానని చెప్పారు.
సమావేశానంతరం గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మగౌరవయాత్ర అనుభవాలను తెలిపారన్నారు. 14వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉందని, ఇది రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడే ఎక్కువ చేస్తుందని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, టి. దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సిం హులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, వైఎస్ చౌదరి, సీఎం రమేష్, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎనుముల రేవంత్‌రెడ్డి, జి.జైపాల్‌యాదవ్, కంభంపాటి రామ్మోహనరావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఇనుగాల పెద్దిరెడ్డి, వర్ల రామయ్య, ఎం.అరవిందకుమార్‌గౌడ్, వీవీవీ చౌదరి, శమంతకమణి, పంచుమర్తి అనూరాధ, సీతక్క, శోభా హైమవతి, బి. శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం సమావేశం జరగ్గా, ఉదయం జరిగిన సమావేశంలో నేతలతోపాటు మీడియా విశ్లేషకులు పాల్గొన్నారు.