vastunna meekosam
-
‘దేశం’ తొలిజాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లు
సాక్షి, కాకినాడ : తెలుగుదేశం తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మండపేట, ప్రత్తిపాడు, రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు), పెందుర్తి వెంకటేష్‌లకు తిరిగి అవకాశం దక్కింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పేరు మాత్రం జాబితాలో చోటు చేసుకోలేవు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాకినాడ రూరల్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిలకు మరోసారి అవకాశం ఇచ్చారు. కొత్తగా.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడికి తునిలో, దాట్ల వెంకటసుబ్బరాజు (బుచ్చిబాబు)కు ముమ్మిడివరంలో అవకాశమిచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే ప్రతిపాదన లేకున్నా చందనను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిని రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపే ఆలోచనే ఇందుకు కారణమంటున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తునిలో టీడీపీ ఓటమికి యనమల కృష్ణుడి వ్యవహారశైలే కారణమని పార్టీ కార్యకర్తలే బాహాటంగా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు తుని టికెట్ ఇవ్వడంతో నాటి చేదు అనుభవం మళ్లీ పునరావృతమవుతుందనే భయాన్ని ఆ పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నారు. కాగా ముమ్మిడివరంలో పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేసిన పలువురు సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి, డబ్బులు దండిగా ఉన్నాయన్న ఏకైక కారణంతో నియోజకవర్గంలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బుచ్చిబాబుకు టికెట్ కట్టబెట్టడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లికి ‘జెల్ల’ తప్పదా! గతంలో ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సమయంలోనే చంద్రబాబు.. రాజమండ్రి ఎంపీ టికెట్‌ను సినీ నటుడు మురళీమోహన్‌కు, అమలాపురం ఎంపీ టికెట్‌ను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ బుధవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఈ ఇద్దరి పేర్లు లేవు. గొల్లపల్లిని పక్కన పెట్టి అమలాపురం ఎంపీ టికెట్‌ను కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవీంద్రబాబుకు కట్టబెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గొల్లపల్లి పేరు జాబితాలో లేకపోవడానికి అదే కారణం కావచ్చంటున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ స్థానం దాదాపు ఖరారైన మురళీమోహన్ పేరు కూడా తొలి జాబితాలో లేకపోవడం చ ర్చనీయాంశమైంది. -
బోరు కొట్టిన బాబు ప్రసంగం
చంద్రబాబునాయుడు జిల్లాలో ‘వస్తున్నా మీకోసం’ యాత్రలో ఇచ్చిన హామీలనే మళ్లీ శనివారం నాటి ప్రజాగర్జనలో పునరుద్ఘాటించారు. అంతేకాకుండా హైటెక్ సిటీ నేనే కట్టించా, హైదరాబాద్‌ను సుందరనగరంగా నేనే తీర్చిదిద్దా.. అంటూ పాత ప్రసంగాన్నే వల్లెవేశారు. రాత్రి 8.20 గంటల నుంచి 9.10 గం టల వరకు సుమారు 50 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. ప్రసంగం చప్పగా సాగడంతో ఆయన మొదలు పెట్టిన 15 నిమిషాల్లోనే పెవిలియన్‌గ్రౌండ్ నుంచి కార్యకర్తలు జారుకున్నారు. చివరకు ఆయన ప్రసంగం ముగిసే సమయానికి గ్రౌండ్ అంతా ఖాళీకాగా, వేదిక వద్దనే కొంతమంది మిగిలారు. చంద్రబాబు తన ప్రసంగంతో జిల్లా కేడర్‌లో ఉత్సాహం నింపలేకపోయారని చర్చ జరిగింది. అంతా నామా షో.... ప్రజాగర్జన సభ ఆద్యంతం ఎంపీ నామా షోగానే సాగింది. ఫ్లెక్సీలు, వీవీఐపీ, వీఐపీ, ప్రెస్ పాస్‌ల్లో పెద్ద పెద్ద ఫోటోలతో ఒకపక్క.... జన్మదినం అంటూ వేదికపైనే కేక్ కటింగ్ చేయించుకుని మరోపక్క హడావుడి చేశారు. తెలంగాణరాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో బాబు సభను నిర్వహిస్తుండడంతో నామా నాగేశ్వరరావు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. అయితే తమతో పూర్తి స్థాయిలో చర్చించకుండా, తమను భాగస్వాములను చేయకుండానే ఏర్పాట్లు చేస్తుండడంతో తుమ్మల వర్గం గుర్రుగానే ఉంది. అయినా జనసమీకరణలో కీలకపాత్రే పోషించిన తుమ్మల వ ర్గీయులకు సభలో అంత ప్రాధాన్యత లభించలేదు. తుమ్మల కూడా బాబుకు దూరంగా పార్టీ నేతల మధ్యలో కూర్చున్నారు. వేదికపైన, ఫ్లెక్సీల్లో, పాస్‌లపైనా తన పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకున్న నామా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కునని చెప్పుకునే ప్రయత్నం చేశారు. నామా జన్మదినవేడుకలను కూడా సభావేదికపైనే జరుపుకోవడం విశేషం. వీవీఐపీ, వీఐపీ పాసులు కూడా నామా వర్గానికే ఎక్కువగా అందాయని తుమ్మల వర్గం ఆగ్రహంగా ఉంది. తమకు పాసులు అందకపోవడంతో వేదిక కింద కార్యకర్తల మాదిరిగానే కూర్చొని బాబు ప్రసంగాన్ని వినాల్సి వచ్చిం దని తుమ్మల వర్గం నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఇక సభ నిర్వహణలో బీసీ నేతలకు పార్టీ ప్రోటోకాల్ ప్రకారం సమాచారం లేదని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అలక వహించినట్లు సమాచారం. అయితే తుమ్మల..బాలసాని ఇంటికి వెళ్లి సర్ది చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొని సభకు హాజరయ్యారు. ఎవరి షో ఎలా ఉన్నా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని ఆశించిన పార్టీ నేతలకు సభకు వచ్చిన జనం చూస్తే సంతృప్తి కలగదనే చెప్పాలి. వచ్చిన జనం కూడా సభలో లేకుండా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.. తెలంగాణలో పలు జిల్లాలకు చెందిన నేతలు, నామా అనుచర గణంతో వేదికపైన చంద్రబాబు కూర్చున్న వరుసలో ఎస్సీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్టీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్యకు చోటు దక్కలేదు. ఈ వరుసలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తుమ్మల, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో మరికొంతమంది తెలంగాణ నేతలు కూర్చున్నారు. అయితే నామా అనుచర నేత .. ఇటీవల టీడీపీలో చేరిన కందిమళ్ల నాగ ప్రసాద్ మాత్రం చంద్రబాబు దగ్గరలోనే కూర్చున్నారు. నామా నాగేశ్వరరావు పక్కన ఎంపీ రామేశ్రాథోడ్, ఆయన పక్కన నాగప్రసాద్ కూర్చోవడం తుమ్మల వర్గ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటి వరకు జిల్లా పార్టీలో గుర్తింపు లేని నాగప్రసాద్‌ను నామా కావాలనే బాబు దగ్గరలో కూర్చోబెట్టారని తుమ్మల అనుచరులు అంటున్నారు. జర్నలిస్టుల నిరసన... చంద్రబాబు వేదిక పైకి రాగానే వేదిక కింద నుంచి ఫోటోగ్రాఫర్లను ఆయన భద్రతా సిబ్బంది పక్కకు నెట్టడంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోని పోలీసులు సంయమనం పాటించాలని చెప్పడంతో జర్నలిస్టులు శాంతించారు. ఈ సభ అనంతరం చంద్రబాబునాయుడు చల్లపల్లి గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా విసృ్తతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐదు నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రత్యేకంగా సమావేశమై మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు. -
కాలం మదిలో...కరిగిన జ్ఞాపకాలు
జనవరి 1న- పేరేచర్ల సమీపంలోని కైలాసగిరిలో విశ్వకల్యాణ మహాయజ్ఞం ప్రారంభమైంది. 8న- హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 18న- నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట హిందూ చైతన్య శిబిరం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, బీజేపీ నేత వెంకయ్య నాయయుడులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 28న- బైబిల్ మిషన్ మహాసభలుప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు వై.ఎస్.విజయమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్‌లు హాజరయ్యారు. ఫిబ్రవరి 1న- సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థి గర్జన జరిగింది. 5న- జిల్లాలో చంద్రబాబు నాయుడు ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్ర మొదలు పెట్టారు. 16న- జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. గుంటూరునగరం పూర్తిగా జలమయం అయింది. 21న- కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు పోలింగ్జరిగింది. 24న-గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అక్రమాలపై రెండవ విడతవిచారణ జరిగింది. 28న పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. మార్చి 1న- జెడ్పీ సీఈవో జయప్రకాశనారాయణ నల్గొండ జిల్లా సీఈవోగా బదిలీ అయ్యారు. 1న - సమాచారహక్కు కమిషనర్ విజయబాబు జిల్లాలో పర్యటించారు. 2న - డీసీసీబీ చైర్మన్‌గా ముమ్మనేని వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా, డీసీఎంఎస్ అధ్యక్షుడిగా ఇక్కుర్తి సాంబశివరావు ఎన్నికయ్యారు. 3న - ఆప్కో చైర్మన్‌గా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు నియమితులయ్యారు. 15న - గుంటూరులో డివిజన్‌స్థాయి రైల్మేళా ప్రారంభమయ్యాయి. 21న- జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మురళీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకారం ఏప్రిల్ 3న - కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిష్కారం సెల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి హాజరయ్యారు. 3న - గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. 6న - తెనాలిలో వైభవంగా తిరుమలేశుని కల్యాణం జరిగింది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. 11న -సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిరంగిపురంలో పర్యటించారు. 17న - గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. 27న - రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించారు. మే 3న - రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు సమీపంలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. 9న - గుంటూరులో జరిగిన రైతు సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. 12న - పిడుగుపాటుకు చౌడవరం, యడ్డపాడు, నాదెండ్ల ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. 19న - చిలకలూరిపేట సమీపంలోని చౌడవరం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో మాజీ జెడ్పీటీసీ మల్లెల సత్యనారాయణ కూడా ఉన్నారు. 20న- బీఆర్స్టేడియంలో జరిగిన 10వ యూత్ ఫెస్టివల్ పోటీల్లో ఓవరాల్ చాంఫ్గా కేరళ జట్టు నిలిచింది. 26న- బాపట్లలో ముగిసిన ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ధి వే డుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జూలై 3న - జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10న - హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్‌కు ఎదురు ధర్నా నిర్వహించారు. 13న - పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ప్రచార పర్వం ముగిసింది. 23న - జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్పూర్తి. అధిక పంచాయతీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ 25న - రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలు రాజీనామా చేశారు. జూన్ 17న - రాజ్యసభ సభ్యులు జేడీ శీలం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 18న- మాజీ క్రికెటర్ పద్మ శ్రీ వీవీఎస్ లక్ష్మణ్ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ అకాడమీని సందర్శించి ఔత్సాహిక క్రీడాకారుల్ని అభినందించారు. 19న - ప్రముఖ ఆలూరి భుజంగరావు గుంటూరులో మరణించారు. అంత్యక్రియలకు వరవరరావు, హాజరయ్యారు. 24న - చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సదస్సు. ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ హాజరు. ఇదే రోజున కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు గుంటూరులో పర్యటించారు. ఆగస్టు 2న - జిల్లాలో మొదలైన సమైక్యాంధ్ర ఆందోళనలు, మొదటి వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది. 12న - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ నిలిచిపోయాయి. 15న - హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తోన్న టీడీపీ నేత,గుంటూరు మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. 18న - రాష్ట్రానికి సమన్యాయం జరగాలని కోరుతూ వైఎస్ విజయమ్మ గుంటూరులో సమరదీక్ష చేపట్టారు. 24న - సమరదీక్షలో ఉన్న వైఎస్ విజయమ్మను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 2న - జిల్లాలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర ప్రారంభమైంది. 11న - జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం ప్రారంభమైంది. 15న -సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లావ్యాప్తంతా ఉవ్వెత్తున ఎగసిపడింది. 18న - అనుమతి లేకుండా సమైక్య సభలు జరిపారని కోడెల, పత్తిపాటి, జీవీలపై పోలీసుల కేసు నమోదు చేశారు. 23న - వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించిన కారణంగా జిల్లా అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. అక్టోబర్ 2న - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దీక్షలు ప్రారంభం 4న - సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 72 గంటల బంద్ ప్రారంభమై విజయవంతమైంది. 8న - జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. 10న - జిల్లాను తాకిని పై-లీన్ తుపాను రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 22 నుంచి 27 వరకూ కురిసిన భారీ వర్షాలు రైతుల్ని నట్టేట ముంచాయి. నవంబర్ 6న - సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా అంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారుల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 9న - తెనాలికి చెందిన ప్రముఖ సినీహాస్యనటుడు ఏవీఎస్ కన్నుమూత. జిల్లా కళారంగం విషాదంలో మునిగిపోయింది. 11న - జిల్లా అంతటా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 14న - మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. డిసెంబర్ 4న - కృష్ణా మిగులు జలాల్లో న్యాయం చేయాలన్న డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ధర్నా నిర్వహించారు. 7న - పులిచింతల ప్రాజెక్టును సీఎం కిరణ్‌కుమార్ ప్రారంభించారు. 8న - ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరశింహారావు మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిలకలూరిపేట వచ్చారు. 9న - మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి గుంటూరులో కన్నుమూశారు. -
..అలా ముందుకు వెళదాం: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వస్తున్నా మీకోసం, తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ గ్రాఫ్ పెరక్కపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను నమ్మించేందుకు చాలా శ్రమపడుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలతో గురువారం తన నివాసంలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. పార్టీకి మంచి భవిష్యత్తే ఉంటుందని, తనను నమ్మాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా తనను అర్థం చేసుకున్నారని తెలిపారు. మా లేఖ వల్లనే తెలంగాణ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత నేతలు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలోనూ పార్టీ వెనకబడిపోయిందని నేతలు ప్రస్తావించగా... రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉభయ ప్రాంతాల నేతలందరినీ త్వరలోనే ఢిల్లీకి తీసుకెళతానని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి విషయాలను వారి దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు. శుక్రవారం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని శనివారం ఉమ్మడి సమావేశంలో పరిష్కారమార్గాలు సూచిస్తానని చెప్పారు. సమావేశానంతరం గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మగౌరవయాత్ర అనుభవాలను తెలిపారన్నారు. 14వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉందని, ఇది రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడే ఎక్కువ చేస్తుందని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, టి. దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సిం హులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, వైఎస్ చౌదరి, సీఎం రమేష్, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎనుముల రేవంత్‌రెడ్డి, జి.జైపాల్‌యాదవ్, కంభంపాటి రామ్మోహనరావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఇనుగాల పెద్దిరెడ్డి, వర్ల రామయ్య, ఎం.అరవిందకుమార్‌గౌడ్, వీవీవీ చౌదరి, శమంతకమణి, పంచుమర్తి అనూరాధ, సీతక్క, శోభా హైమవతి, బి. శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం సమావేశం జరగ్గా, ఉదయం జరిగిన సమావేశంలో నేతలతోపాటు మీడియా విశ్లేషకులు పాల్గొన్నారు.