బోరు కొట్టిన బాబు ప్రసంగం
చంద్రబాబునాయుడు జిల్లాలో ‘వస్తున్నా మీకోసం’ యాత్రలో ఇచ్చిన హామీలనే మళ్లీ శనివారం నాటి ప్రజాగర్జనలో పునరుద్ఘాటించారు. అంతేకాకుండా హైటెక్ సిటీ నేనే కట్టించా, హైదరాబాద్‌ను సుందరనగరంగా నేనే తీర్చిదిద్దా.. అంటూ పాత ప్రసంగాన్నే వల్లెవేశారు. రాత్రి 8.20 గంటల నుంచి 9.10 గం టల వరకు సుమారు 50 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. ప్రసంగం చప్పగా సాగడంతో ఆయన మొదలు పెట్టిన 15 నిమిషాల్లోనే పెవిలియన్‌గ్రౌండ్ నుంచి కార్యకర్తలు జారుకున్నారు. చివరకు ఆయన ప్రసంగం ముగిసే సమయానికి గ్రౌండ్ అంతా ఖాళీకాగా, వేదిక వద్దనే కొంతమంది మిగిలారు. చంద్రబాబు తన ప్రసంగంతో జిల్లా కేడర్‌లో ఉత్సాహం నింపలేకపోయారని చర్చ జరిగింది.
అంతా నామా షో....
ప్రజాగర్జన సభ ఆద్యంతం ఎంపీ నామా షోగానే సాగింది. ఫ్లెక్సీలు, వీవీఐపీ, వీఐపీ, ప్రెస్ పాస్‌ల్లో పెద్ద పెద్ద ఫోటోలతో ఒకపక్క.... జన్మదినం అంటూ వేదికపైనే కేక్ కటింగ్ చేయించుకుని మరోపక్క హడావుడి చేశారు. తెలంగాణరాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో బాబు సభను నిర్వహిస్తుండడంతో నామా నాగేశ్వరరావు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు.
అయితే తమతో పూర్తి స్థాయిలో చర్చించకుండా, తమను భాగస్వాములను చేయకుండానే ఏర్పాట్లు చేస్తుండడంతో తుమ్మల వర్గం గుర్రుగానే ఉంది. అయినా జనసమీకరణలో కీలకపాత్రే పోషించిన తుమ్మల వ ర్గీయులకు సభలో అంత ప్రాధాన్యత లభించలేదు. తుమ్మల కూడా బాబుకు దూరంగా పార్టీ నేతల మధ్యలో కూర్చున్నారు. వేదికపైన, ఫ్లెక్సీల్లో, పాస్‌లపైనా తన పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకున్న నామా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కునని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
నామా జన్మదినవేడుకలను కూడా సభావేదికపైనే జరుపుకోవడం విశేషం. వీవీఐపీ, వీఐపీ పాసులు కూడా నామా వర్గానికే ఎక్కువగా అందాయని తుమ్మల వర్గం ఆగ్రహంగా ఉంది. తమకు పాసులు అందకపోవడంతో వేదిక కింద కార్యకర్తల మాదిరిగానే కూర్చొని బాబు ప్రసంగాన్ని వినాల్సి వచ్చిం దని తుమ్మల వర్గం నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఇక సభ నిర్వహణలో బీసీ నేతలకు పార్టీ ప్రోటోకాల్ ప్రకారం సమాచారం లేదని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అలక వహించినట్లు సమాచారం.
అయితే తుమ్మల..బాలసాని ఇంటికి వెళ్లి సర్ది చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొని సభకు హాజరయ్యారు. ఎవరి షో ఎలా ఉన్నా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని ఆశించిన పార్టీ నేతలకు సభకు వచ్చిన జనం చూస్తే సంతృప్తి కలగదనే చెప్పాలి. వచ్చిన జనం కూడా సభలో లేకుండా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు..
తెలంగాణలో పలు జిల్లాలకు చెందిన నేతలు, నామా అనుచర గణంతో వేదికపైన చంద్రబాబు కూర్చున్న వరుసలో ఎస్సీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్టీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్యకు చోటు దక్కలేదు. ఈ వరుసలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తుమ్మల, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో మరికొంతమంది తెలంగాణ నేతలు కూర్చున్నారు. అయితే నామా అనుచర నేత .. ఇటీవల టీడీపీలో చేరిన కందిమళ్ల నాగ ప్రసాద్ మాత్రం చంద్రబాబు దగ్గరలోనే కూర్చున్నారు. నామా నాగేశ్వరరావు పక్కన ఎంపీ రామేశ్‌రాథోడ్, ఆయన పక్కన నాగప్రసాద్ కూర్చోవడం తుమ్మల వర్గ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటి వరకు జిల్లా పార్టీలో గుర్తింపు లేని నాగప్రసాద్‌ను నామా కావాలనే బాబు దగ్గరలో కూర్చోబెట్టారని తుమ్మల అనుచరులు అంటున్నారు.
జర్నలిస్టుల నిరసన...
చంద్రబాబు వేదిక పైకి రాగానే వేదిక కింద నుంచి ఫోటోగ్రాఫర్లను ఆయన భద్రతా సిబ్బంది పక్కకు నెట్టడంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోని పోలీసులు సంయమనం పాటించాలని చెప్పడంతో జర్నలిస్టులు శాంతించారు. ఈ సభ అనంతరం చంద్రబాబునాయుడు చల్లపల్లి గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా విసృ్తతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐదు నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు.
అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ప్రత్యేకంగా సమావేశమై మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు.