సాక్షి, కాకినాడ : తెలుగుదేశం తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మండపేట, ప్రత్తిపాడు, రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు), పెందుర్తి వెంకటేష్‌లకు తిరిగి అవకాశం దక్కింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పేరు మాత్రం జాబితాలో చోటు చేసుకోలేవు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాకినాడ రూరల్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిలకు మరోసారి అవకాశం ఇచ్చారు.
కొత్తగా.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడికి తునిలో, దాట్ల వెంకటసుబ్బరాజు (బుచ్చిబాబు)కు ముమ్మిడివరంలో అవకాశమిచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే ప్రతిపాదన లేకున్నా చందనను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిని రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపే ఆలోచనే ఇందుకు కారణమంటున్నారు.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తునిలో టీడీపీ ఓటమికి యనమల కృష్ణుడి వ్యవహారశైలే కారణమని పార్టీ కార్యకర్తలే బాహాటంగా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు తుని టికెట్ ఇవ్వడంతో నాటి చేదు అనుభవం మళ్లీ పునరావృతమవుతుందనే భయాన్ని ఆ పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నారు. కాగా ముమ్మిడివరంలో పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేసిన పలువురు సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి, డబ్బులు దండిగా ఉన్నాయన్న ఏకైక కారణంతో నియోజకవర్గంలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బుచ్చిబాబుకు టికెట్ కట్టబెట్టడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గొల్లపల్లికి ‘జెల్ల’ తప్పదా!
గతంలో ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సమయంలోనే చంద్రబాబు.. రాజమండ్రి ఎంపీ టికెట్‌ను సినీ నటుడు మురళీమోహన్‌కు, అమలాపురం ఎంపీ టికెట్‌ను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ బుధవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఈ ఇద్దరి పేర్లు లేవు.
గొల్లపల్లిని పక్కన పెట్టి అమలాపురం ఎంపీ టికెట్‌ను కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవీంద్రబాబుకు కట్టబెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గొల్లపల్లి పేరు జాబితాలో లేకపోవడానికి అదే కారణం కావచ్చంటున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ స్థానం దాదాపు ఖరారైన మురళీమోహన్ పేరు కూడా తొలి జాబితాలో లేకపోవడం చ ర్చనీయాంశమైంది.
‘దేశం’ తొలిజాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లు
Published Thu, Apr 10 2014 12:38 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement