జనగళం మనం..కదనదళం మనం
సాక్షి, కాకినాడ :‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం అడ్డదారులన్నీ తొక్కాడు. నోటికొచ్చిన అబద్దాలన్నీ ఆడాడు. ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చాడు. తీరా ప్రజలు అధికారమిస్తే ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా భయపడుతున్నాడు. ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయాలో తెలియక ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ర్ట నేత, నంద్యాల ఎమ్మెల్యే, త్రిసభ్య కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి విమర్శించారు. ‘ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంట పడదాం. అమలు చేయకుంటే ప్రజల్లో ఎండగడదాం. ఇప్పటి నుంచే కార్యోన్ముఖులవుదాం’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక గొడారి గుంటలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై నాగిరెడ్డి సమీక్ష జరిపారు.
ఉదయం కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, మధ్యాహ్నం పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరిగిన లోపాలను గుర్తించేందుకు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తమ పార్టీ పోరాటాల మధ్యే పుట్టిందని, పోరాటాలు చేయడం కొత ్తకాదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అవలంబించబోయే ప్రజావ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఉత్తేజ పరిచారు. పార్టీని గ్రామ, బూత్ స్థాయి వరకు పటిష్టపర్చాలని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢశ్చయంతో ఉన్నారన్నారు. ఈ నెలలోనే ‘బాబు’ బండారం బయటపడుతుంది..
‘రైతులకు రుణమాఫీ చేస్తానంటూ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చారు. ఒక వైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు టాంటాంలు వేయిస్తున్నారు. బాబు ఇప్పటి వరకూ కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. రుణమాఫీ చేయకుంటే ఖరీఫ్‌లో కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకర్లు తెగేసిచెబుతున్నారు. ఈ నెలలోనే బాబు బండారం బయటపడుతుంది’ అని నాగిరెడ్డి అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రూ.80వేల కోట్లకు పైగా రైతు రుణాలు మాఫీ చేయడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఇదొక్కటే కాదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మరో హామీ ఇచ్చాడు. రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభమవుతున్న మన రాష్ర్టంలో కనీసం ఉద్యోగులకు ఈ నెల జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తానన్నాడు. ఈ హామీలన్నీ అమలు చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. లేకుంటే ప్రజల పక్షాన పోరాడదాం. ప్రతిపక్షమంటే ఎలా ఉండాలో చూపిద్దాం’ అన్నారు.
మనోస్థైర్యంతో ముందుకెళ్లండి..భవిష్యత్తు మనదే
‘మోడీ, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటి శక్తులన్నీ ఏకమయ్యాయి. వీటికి టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తోడవడం వల్లే వైఎస్సార్ సీపీ స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది’ అని నాగిరెడ్డి అన్నారు. ‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈ జిల్లాలో కులాలు, ప్రాంతాల వంటి ఎన్నో అంశాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అయినా ఎందుకిలా జరిగిందని ఎవరికి వారు ప్రశ్నించుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటూ పయనం సాగించాలి’ అని కార్యకర్తలకు సూచించారు. ఓటమిని గుణపాఠంగా తీసుకొని గెలుపునకు బాటలు వేసుకోవాలన్నారు. అతివిశ్వాసం దెబ్బ తీసినా, భవిష్యత్ వైఎస్సార్ సీపీదేనని, ప్రతి కార్యకర్తా మనోస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు ప్రసంగించారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, కాకినాడ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాకినీడి గంగారాం,
లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, మాజీ ఎంపీపీ గొర్ల అచ్చియ్యనాయుడు, రాష్ర్ట యూత్ కమిటీ సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పీబీసీ-1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్, వీరంరెడ్డి కాశిబాబు, డాక్టర్ బోసు, జ్యోతుల పెదబాబు, ముదునూరి లోవలక్ష్మి, చెన్నాడ సత్య నారాయణ, ఏలేశ్వరం మాజీ సర్పంచ్ అలమండ చలమయ్య, పార్టీ నాయకులు గొల్లు చినదివాణం, అత్తులూరి నాగబాబు, జంపన సీతారామచంద్రవర్మ, దత్తుడు, కుంచే రాజా, మారిశెట్టి భద్రం, గాజింగం సత్తిబాబు, కర్రి సత్యనారాయణ, వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, గీత తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష పాత్రను సమర్థంగా
పోషిద్దాం..
టీడీపీ ప్రభుత్వం అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండ గడదాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఒత్తిడి తీసుకొద్దాం. లేకుంటే ప్రజల పక్షాన పోరాడదాం. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే కృషి చేద్దాం.
- జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే, జగ్గంపేట
బూత్ స్థాయి నుంచి
బలోపేతం చేద్దాం..
అలసత్వం వీడి, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం. నాకు మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు, గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటా. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేస్తా.
- వరుపుల సుబ్బారావు,
ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
కార్యకర్తలకు అండగా ఉందాం..
స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. ఈ సమయంలోనే పార్టీని బలోపేతం చేసుకావాలి. కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపి, అండగా ఉండాలి. ముఖ్యంగా యనమల సొంత నియోజకవర్గంలో ఆయన సాగించే కక్ష సాధింపు చర్యలను అడ్డుకునేందుకు, కార్యకర్తలకు అండగా నిలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
- దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని
భవిష్యత్ కోసం బాటలు వేద్దాం..
నా గెలుపు కోసం పార్టీ యంత్రాంగం ఎంతో సమష్టిగా పనిచేసింది. అయినా ఓటమి చవిచూశాం. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే బాటలు వేసుకుందాం. పటిష్టమైన క్యాడర్‌తో పక్కా ప్రణాళికతో ముందుకు వెళదాం. భవిష్యత్తులో విజయాన్ని అందుకుందాం.
- ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,
పార్టీ కాకినాడ సిటీ ఆర్డినేటర్
సమర్థ నాయకత్వాన్ని తయారు చేద్దాం..
పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టపర్చేందుకు ఇప్పటి నుంచే కృషి చేద్దాం. క్షేత్రస్థాయి నుంచి సమర్థ నాయ క త్వాన్ని తయారు చేద్దాం. ఈ ఓటమితో గెలుపునకు బాటలు వేసుకుందాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకునే వరకు నిర్విరామంగా పోరాడదాం.
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,
పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్
లోపాలను సరిదిద్దుకుందాం..
స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను చక్కదిద్దుకోవాలి. పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేయాలి. కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉండాలి. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరం నిర్విరామంగా శ్రమిద్దాం.
-పెండెం దొరబాబు, పార్టీ పిఠాపురం కో ఆర్డినేటర్
బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాం..
పుట్టిన వె ంటనే బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాం. భవిష్యత్ ఎంతో ఉంది. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకభూమిక పోషిద్దాం. పార్టీని బలోపేతం చేసుకుందాం.
-తోట సుబ్బారావు నాయుడు, పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్