సీపీఎస్ రద్దుకు నేడు ఢిల్లీలో ధర్నా
పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం ధర్నాకు దిగనున్నారు. ధర్నా అనంతరం పార్లమెంటు వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు తెలంగాణ ఎన్జీవో సంఘం, గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం మద్దతు పలికాయి. ధర్నాలో పాల్గొనడానికి రెండు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఇక్కడి తెలంగాణ భవన్‌లో టీఎన్జీవో సంఘం గౌరవాధ్య క్షుడు దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగుల హక్కు అయిన పెన్షన్ స్వీకరణకు ప్రతిబంధకంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత తదితరులు మద్దతు పలికారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ ఉద్యోగులు పాల్గొన్నారు.