
మిన్నంటిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ నిరసనలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లాల్లో కొనసాగాయి.
సాక్షి, నెట్‌వర్క్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లాల్లో కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు గైని గంగారాం, కిషన్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు సత్వరమే ప్రవేశ పెట్టాలని, జాప్యం చేస్తే గతంలో మాదిరిగా మళ్లీ సకల జనుల సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట, కామారెడ్డిలో భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన నందిపేటలో రిలే నిరాహార దీక్షలు 937వ రోజుకు చేరుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదని ఖమ్మంలో జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు పువ్వులతో వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. గె జిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఖాజామియా ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాచలంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఇల్లెందు, అశ్వారావుపేట, పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, మధిర, కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో ఉద్యోగులు ధర్నా, మానవహారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చి సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని, పెద్దపల్లి , సిరిసిల్ల, మల్యాలలో ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. నల్లగొండలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రెండోరోజు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓ విజ్ఞప్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, వారి భద్రతకు ఇక్కడి ఉద్యోగులదే బాధ్యతన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామన్నారు.