తలసాని.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిర్మల్ రూరల్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యవహారం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరిన ఆయన తనకు ఓట్లేసిన ప్రజలనూ మోసం చేశాడని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పి, మంత్రి పదవి చేపట్టిన ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్‌లోనూ ఉప ఎన్నికలు తప్పవని, పరోక్షంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకు ముందు నిర్మల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సీనియర్ నాయకులు సి.రాంచంద్రయ్య, నారాయణరావు పటేల్ తదితరులు ఉన్నారు.