తెలంగాణ వర్సెస్ సమైక్యం | Telangana Versus Samaikyandhra movement | Sakshi
Sakshi News home page

తెలంగాణ వర్సెస్ సమైక్యం

Published Wed, Aug 14 2013 4:34 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

తెలంగాణ వర్సెస్ సమైక్యం - Sakshi

తెలంగాణ వర్సెస్ సమైక్యం

 హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు సంఘాల ఉద్యోగులు తెలంగాణ, సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఏపీఎన్జీవో పిలుపు మేరకు మంగళవారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లో ఆ సంఘం ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాలలోని తోటి సీమాంధ్ర ఉద్యోగులను నిరసనలో పాల్గొనాలని కోరారు. అనంతరం డీఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో ర్యాలీలు నిర్వహించారు. అదే సమయంలో టీఎన్జీవోలు, టీజీవోలు, ఇతర తెలంగాణ ఉద్యోగులు సద్భావన యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్విహ ంచారు.
 
  దీంతో ఇరుసంఘాల ఉద్యోగులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో క్యాంపస్ మార్మోగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఏపీఎన్జీవోల ఉద్యోగులను డీఎంహెచ్‌ఎస్ నుంచి పంపించి వేశారు. ఇంతలోనే తెలంగాణ ఉద్యోగుల ర్యాలీ వద్దకు టీఎన్జీవోల అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి వచ్చారు. అయితే సుల్తాన్‌బజార్ ఏసీపీ సోమేశ్వరరావు నేతృత్వంలో వారిద్దరినీ అరెస్ట్ చేసి, అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా స్టేషన్ గేటు వైపు దూసుకురావడంతో పోలీసులు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఇంతలోనే టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ అక్కడకు చేరుకోవడంతో వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి సుల్తాన్‌బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
 అయితే, అరెస్టయినవారిని ఎంతకీ విడిచిపెట్టకపోవడంతో ఆగ్రహించిన టీఎన్జీవోలు, టీజీవోలు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. అరెస్టయిన వారికి మద్దతుగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆర్వీ మహేందర్‌కుమార్ తదితరులు ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌ను నిలదీశారు. ఉద్యోగులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించడంతో అక్కడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు. అనంతరం దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టడానికే ప్రభుత్వం, సీమాంధ్ర మంత్రులు, పెట్టుబడిదారులు  ఏపీఎన్జీవోలతో సమైక్యాంధ్ర సమ్మెను చేయిస్తున్నారని ఆరోపించారు.  బుధవారం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు అధ్యక్షులు అశోక్‌బాబు తెలంగాణ వారిని కుక్క అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడితే  జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
 ఉపేక్షిస్తే .. ఉద్యమిస్తాం..
 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమేనని తెలంగాణ జిల్లాల్లోని ఉద్యోగులు అన్నారు. సీమాంధ్రలో తెలంగాణవాదులను, ఉద్యమ నేతలను కించపరుస్తూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఏపీ ఎన్‌జీవోలు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఆరుదశాబ్దాల కల..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట నీ, దీనిపై ఉపేక్షిస్తే.. మళ్లీ ఉద్యమిస్తమని వారు హెచ్చరించారు.  సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. కేంద్ర సంఘం పిలుపు మేరకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా అన్ని డివిజన్‌స్థాయి కార్యాలయాలతోపాటు కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నిరసనలు తెలిపారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో ధర్నాలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగారుు.  టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ల అరెస్ట్‌కు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రాస్తారోకో చేశారు.
 
  కరీంనగర్‌లో వివిధ శాఖల ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నీటిపారుదలశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎల్‌ఎండీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్‌ర్యాలీతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో  తెలంగాణ చౌక్‌లో  సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట,  నిర్మల్, మంచిర్యాలలో ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు.  ఖమ్మం,  నల్లగొండ జిల్లా కలెక్టరేట్ల   ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు.  మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల ఎదుట ధర్నాలు కొనసాగిం చారు. రంగారెడ్డి జిల్లా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement