తెలుగువారంతా మావెంటే
కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఢిల్లీ సీఎం షీలా
సాక్షి ప్రతినిధి ఎన్.సత్యనారాయణ: న్యూఢిల్లీ: హస్తినలో వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని ‘హస్త’గతం చేసుకోబోతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేనన్నారు. తొలిసారి రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆమె తేలిగ్గా తీసుకున్నారు. అది రాజకీయ పార్టీనో కాదో ఎన్నికల తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...
ప్రశ్న: ఈ సారి ఢిల్లీలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి?
జవాబు: కచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. ఎలాంటి సందేహమూ లేదు.
ప్రశ్న: ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు వారున్నారు. వారు ఎవరి వైపు మొగ్గొచ్చు?
జవాబు: ఢిల్లీలో ఇంతమంది తెలుగు వారుండటం మాకెంతో గౌరవం. రాష్ట్రాభివృద్ధిలో వాళ్లది కీలకపాత్ర. వారు గతంలో మా వెంటే ఉన్నారు. ఈసారీ మావెంటే ఉంటారని నమ్ముతున్నాం.
ప్రశ్న: ఆమ్ ఆద్మీ, బీజేపీల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఏది?
జవాబు: ఎన్నికల్లో పోటీచేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది.
ప్రశ్న: కాంగ్రెస్ ఓటు బ్యాంకైన బడుగులు, ముస్లిం మైనారిటీల ఓట్లను ఆమ్ ఆద్మీ చీలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి?
జవాబు: అదసలు రాజకీయ పార్టీనో కాదో ఇంకా తేలలేదు! ప్రజలు ఆ పార్టీ వైపు ఉన్నారో లేదో ఎన్నికల్లో తేలుతుంది.
ప్రశ్న: ఆమ్ ఆద్మీ వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటోంది కదా?
జవాబు: ప్రచారంతో గెలుపు సాధ్యం కాదు. ఓట్లు రావు.
ప్రశ్న: మీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కామన్వెల్త్ క్రీడల స్కాం, ఉల్లి, టమాట ధరలు గెలుపుపై ప్రభావం చూపుతాయా?
జవాబు: అవినీతికి ఆధారాలున్నాయా? ఉల్లి, టమోటా ధరలు తగ్గాయి. జనానికి పార్టీ మేనిఫెస్టో ఏమిటనేదే ప్రధానం.
ప్రశ్న: ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన, మహిళలకు భద్రతపై మీ స్పందన?
జవాబు: నిర్భయ ఘటన బాధాకరం. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మా ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. సీఎం కార్యాలయంలో ‘181’ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకున్నాం.