
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.
ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.
