మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి | Tension at Maredpally police station | Sakshi
Sakshi News home page

మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి

Published Tue, Aug 4 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి

మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి

* తమ ప్రాంతానికి చెందిన యువకుడిని పోలీసులు కొట్టిచంపారంటూ స్థానికుల దాడి
* కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం.. ఆవరణలోని పలు వాహనాలకు నిప్పు
* ఐదుగురు పోలీసులకు గాయాలు

 
హైదరాబాద్: తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అన్యాయంగా కొట్టిచంపారంటూ... సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాదాపు 200 మంది దాడికి దిగారు. పోలీస్‌స్టేషన్‌లోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు, ఫైళ్లను చిందరవందర చేసి, స్టేషన్ ఆవరణలో ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు తేరుకునే లోపే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి.
 
 మారేడ్‌పల్లి వాల్మీకినగర్‌కు చెందిన బన్నప్ప అనే ఆటో డ్రైవర్ ఆదివారం జరిగిన బోనాల వేడుకల సందర్భంగా అక్కడ బందోబస్తులో ఉన్న ఒక హోంగార్డుతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బన్నప్ప తనపై దాడిచేశాడంటూ సదరు హోంగార్డు ఫిర్యాదు చేశాడు. దీంతో మారేడ్‌పల్లి పోలీసులు ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకుని రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకుని చితకబాదారు. సోమవారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో బన్నప్ప బంధువుల ప్రమేయంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అయితే ఇంటికెళ్లాక బన్నప్ప శరీరంపై దెబ్బలు చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. తీవ్రమైన దెబ్బలుగా గుర్తించిన ఆ వైద్యుడు... గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
 
దీంతో వారు గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగానే.. ఆటోలోనే బన్నప్ప చనిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బన్నప్ప బంధుమిత్రులు, ఆ ప్రాంతం వారు మృతదేహాన్ని మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని  రోడ్డుపై ఉంచి పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. బోనాల బందోబస్తు కారణంగా పోలీస్‌స్టేషన్‌లో నలుగురైదురుగు సిబ్బంది మాత్రమే ఉండడంతో వారిని నియంత్రించలేకపోయారు. దగ్గరలోనే నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయం ఉన్నప్పటికీ... విషయం తెలుసుకుని అదనపు పోలీసులు వచ్చేటప్పడికి దాడికి దిగినవారు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీస్‌స్టేషన్‌లోని ఆయుధాలు కూడా పోయినట్లు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక కీలకమైన సీసీ కెమెరా పుటేజీల రికార్డింగ్‌కు సంబంధించిన బాక్స్‌ను సైతం ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి నేపథ్యంలో మారేడ్‌పల్లి ప్రాంతంలో భారీస్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడినవారి కోసం
 గాలిస్తున్నారు.
 
 నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం: సీపీ
 మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి, నిందితుడి మృతి ఘటనలపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. సుమారు 200 మంది పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారన్నారు. కాగా అతిగా మద్యం సేవించడం వల్లే బన్నప్ప చనిపోయి ఉంటాడని నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement