Hyperactive Snatcher Targets 6 Women in 6 Hours in Hyderabad - Sakshi
Sakshi News home page

ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్‌!

Published Thu, Jan 20 2022 10:33 AM | Last Updated on Thu, Jan 20 2022 1:54 PM

Hyderabad: Hyperactive Snatcher Targets 6 Women In 6 Hours - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో తొలిసారి ఓ చైన్‌ స్నాచర్‌ ఒంటరిగా వరసపెట్టి పంజా విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల గొలుసు లు అతడికి చిక్కగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు.  పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్‌ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్‌ ధరించి.. యాక్టివా వాహనంపై సంచరిస్తూ ఈ నేరాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన ఆధారాలతో ముందుకెళ్తున్నాయి. నిందితుడు వినియోగించిన యాక్టివా వాహనం మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని జిర్రా రోడ్డులో చోరీకి గురైనట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  


తుకారాం గేట్‌ పీఎస్‌ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు
 

సుదీర్ఘ కాలం తర్వాత.. 
మహా నగరం ఒకప్పుడు వరుస స్నాచింగులతో బెంబేలెత్తిపోయేది. స్నాచర్ల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. 2014 తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా వరుస ఉదంతాలు లేకపోయినా.. అడపాదడపా స్నాచర్లు పంజా విసురుతూనే ఉన్నారు. 2018 డిసెంబర్‌లో ఆఖరుసారిగా వరుస స్నాచింగ్స్‌ చోటుచేసుకున్నాయి. ఆ నెల చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని బవారియా నుంచి వచ్చిన గ్యాంగ్‌ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలోని 9 ప్రాంతాల్లో పంజా విసిరింది. ఈ గ్యాంగ్‌ను వారం రోజుల్లోనే హైదరాబాద్‌ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత గడిచిన రెండేళ్లల్లో ఈ తరహాలో వరుస ఉదంతాలు చోటుచేసుకోలేదు. 

అదను చూసుకుని పంజా.. 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గడిచిన కొన్నాళ్లుగా హడావుడి నెలకొంది. కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు, ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి పండగ నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తంగా వ్యవహరించింది. సాధ్యమైనంత వరకు నేరాలు జరగకుండా వ్యూహాత్మకంగా గస్తీ నిర్వహించింది. గడిచిన కొన్ని రోజుల్లో మూడు కమిషనరేట్లలోని పోలీసుల్లో అనేక మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 800 మందికి పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. దీని ప్రభావం పోలీసింగ్‌తో పాటు ఠాణాల నిర్వహణ, గస్తీపై పడింది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న చైన్‌ స్నాచర్‌ అదను చూసుకుని, గస్తీ లేని ప్రాంతాల్లో సంచరిస్తూ వరుసగా మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. 


తుకారాం గేట్‌ పీఎస్‌ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు

22.3 కి.మీ.. 18.5 తులాలు.. 
సైబరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఇతగాడు తన ‘పని’ ప్రారంభించాడు. అక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్‌ కాలనీల్లో ‘సంచరిస్తూ’.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రవేశించి మారేడుపల్లి ఠాణా పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పంజా విసిరాడు. అట్నుంటి తుకారాంగేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్‌ వద్ద చివరి స్నాచింగ్‌ చేశాడు. చివరగా రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్‌ లక్ష్మినగర్‌ కాలనీలో పంజా విసిరాడు.

బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి ఉదంతం జరిగితే ఆ ప్రాంతానికి 22.3 కి.మీ దూరంలో సాయంత్రం 4.30 గంటలకు చివరి ఉదంతం చోటుచేసుకుంది. నాలుగు చోట్ల ‘సఫలీకృతుడైన’ స్నాచర్‌.. మొత్తం 18.5 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. స్నాచర్‌ కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీలకు చెందిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాయి.  

‘ముగ్గురూ’ పోటాపోటీగా... 
మూడు కమిషనరేట్ల పరిధిలో హల్‌చల్‌ చేసిన చైన్‌ స్నాచర్‌ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ పోటాపోటీగా గాలిస్తున్నాయి. తుకారాంగేట్‌ తర్వాత అడ్డగుట్ట నుంచి సదరు స్నాచర్‌ రాచకొండ పరిధిలోకి ప్రవేశించి మేడిపల్లిలో పంజా విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబరాబాద్, రాచకొండ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నామంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఒకటిరెండు రోజుల్లో కచ్చితంగా పట్టుకుంటాం’ అని అన్నారు. 

► భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమారాణి తన ఇంటి ఎదుట నిల్చుని ఉండగా.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయేందుకు ప్రయత్నించాడు. ఆమె వారిస్తూ గట్టిగా అరవడంతో సఫలీకృతుడు కాలేదు.

►రాఘవేంద్ర కాలనీకి చెందిన అనురాధ కూరగాయలు ఖరీదు చేసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్‌ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుపోయాడు.

► శ్రీరామ్‌ నగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వరలక్ష్మి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని బాలానగర్‌ వైపు పారిపోయాడు. 

►మారేడుపల్లి పరిధిలోని సంజీవయ్య నగర్‌కు చెందిన విజయ (55) కుమార్తె ఏఓసీ సెంటర్‌ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయ అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న తమ బస్తీకి కాలినడకన బయలుదేరింది. ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన స్నాచర్‌ ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు.

► తుకారాంగేట్‌ పరిధిలోని నందనార్‌ నగర్‌ సమోసా గార్డెన్స్‌ వద్ద అద్దె ఇంటికోసం వెతుకుతున్న సాయినగర్‌కు చెందిన రాంబాయి (65) మెడలోంచి రెండు తులాల చైను లాక్కెళ్లాడు. అక్కడ నుంచి అడ్డగుట్ట చౌరస్తా మీదుగా ఉండాయించాడు.

► మేడిపల్లి ఠాణా పరిధిలోని బోడుప్పల్‌ లక్ష్మినగర్‌ కాలనీకి చెందిన కట్ట అంజమ్మ (50) వాకింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు.   

దొంగతనం జరిగిందిలా..
► ఉదయం 11గం.. భాగ్యలక్ష్మి కాలనీ ఉమారాణి స్నాచింగ్‌కు యత్నం

►ఉదయం 11:10 గం.. రాఘవేంద్ర కాలనీ అనురాధ, 2 తులాలు

►ఉదయం 11:20 గం.. శ్రీరాంనగర్‌ కాలనీ వరలక్ష్మి, 4 తులాలు 

►మధ్యాహ్నం 12:30 గం.. ఇంద్రపురి రైల్వే కాలనీ విజయ, 5 తులాలు

►మధ్యాహ్నం 12:55 గం.. సమోసా గార్డెన్స్‌ రాంబాయి, 2.5 తులాలు

►సాయంత్రం 4:30గం.. లక్ష్మీనగర్‌ కాలనీ అంజమ్మ, 5 తులాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement