ఆగని ‘ప్రత్యేక’ హింస
దిఫు/గువాహటి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలంటూ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు హింసకు పాల్పడుతూనే ఉన్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ బోడో సంఘాల ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు.
అలాగే దిఫు, దోల్డోలి స్టేషన్ల మధ్య మరోసారి పట్టాలను తొలగించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం శనివారం వరుసగా రెండో రోజు కూడా కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో కవాతు నిర్వహించింది. మరోవైపు ప్రత్యేక బోడోలాండ్‌ను ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అస్సాంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రాష్ట్రం నుంచి తమ ప్రాంతాన్ని విభజించి కామత్‌పుర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆల్ కోచ్-రాజ్‌బోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్ శనివారం గవర్నర్ జె.బి. పట్నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాగా, కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో తిరిగి శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పంపిన ఇద్దరు మంత్రులు దిఫు పట్టణం చేరుకొని వివిధ రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులతో చర్చలు చేపట్టారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌ను కేంద్రానికి తెలియజేస్తామని రాజకీయ నేతలకు హామీ ఇచ్చినట్లు అనంతరం వారు విలేకరులకు తెలిపారు. కాగా, అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆందోళనకారుల డిమాండ్లను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శనివారం నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రజలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలని కోరుకుంటున్నారని చెప్పారు.
స్తంభించిన డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ర్టంగా ప్రకటించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) శనివారం ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్‌తోపాటు కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, మూతపడ్డాయి. రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డార్జిలింగ్‌కు సమీపంలోని రామమ్, రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో రోజుకు 80-100 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు.