Seperate state
-
ప్రాణాల మీదకు తెచ్చిన ప్రత్యేక రాష్ట్రం
ఒక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం.. కొన్ని వందల ప్రాణాలను బలిగొంటోంది. డార్జిలింగ్ కొండల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాటం సాగుతుండటంతో అక్కడి టీ తోటల కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆకలి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు టీ ఎస్టేట్లు మూతపడ్డాయి. అనిశ్చిత పరిస్థితి ఉండటం, టీ వేలం పాటలు కొనసాగకపోవడంతో తమ వ్యాపారానికి భరోసా లేదని టీ ఎస్టేట్లను యజమానులు మూసేసుకున్నారు. దాంతో చేయడానికి పని దొరక్క.. అనేక మంది కార్మికులు డొక్క ఎండిపోయి.. ఆకలి చావుల బారిన పడుతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు కారు. రాష్ట్రంకోసం జరుగుతున్న పోరాటం వల్ల ఉపాధి కోల్పోయి మరణించినవాళ్లు. గతంలో దాదాపు దశాబ్ద కాలం క్రితం పశ్చిమ మిడ్నపూర్ ప్రాంతంలోని ఆమ్లాసోల్లో ఇలాగే ఆకలిచావులు సంభవించినప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. కానీ, నాటి వామపక్ష ప్రభుత్వం, ఇప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం రెండూ కూడా.. ఇవి ఆకలి చావులని గుర్తించడానికి అంగీకరించట్లేదు. గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో దాదాపు వెయ్యిమంది వరకు టీ కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆకలి చావుల బారిన పడ్డారు. ఒకప్పుడు ఎడతెగని డిమాండుతో ఒక వెలుగు వెలిగిన టీ తోటలు ఇప్పుడు మూలపడటంతో ఆర్థికవ్యవస్థ మొత్తం కుప్పకూలుతోంది. అసలే తక్కువ ఆదాయం, తగిన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలతో అతలాకుతలం అవుతున్న టీ కార్మికులకు ప్రస్తుత పరిస్థితి పులిమీద పుట్రలా ఉంది. ఇప్పుడు కనీసం కూలిపని చేద్దామన్నా దొరకట్లేదు. తినడానికి నాలుగు మెతుకులు కూడా సంపాదించుకోలేని పరిస్థితులు రావడంతో.. చివరకు టీ కార్మికులు తమ పిల్లలను కూడా అమ్ముకుంటున్నారు. చివరకు అమ్ముకోడానికి ఏమీ మిగలని పరిస్థితుల్లో ఆకలిబారిన పడి మరణిస్తున్నారు. పిల్లలైతే కేవలం మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలలకు వెళ్తున్నారు. ఇక్కడున్న కూలీల్లో దాదాపు సగం మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.. ఈలోపు మాత్రం ఉద్యమం వల్ల ఆకలి చావులను చూడాల్సి వస్తోంది!! -
ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీడీపీ, బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలవడం ఖాయమన్నారు. గతంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ వద్దనందుకే తెలంగాణ ఏర్పాటు చేయలేదని బీజేపీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం కలిగించడానికి బీజేపీ అడ్డుకునే అవకాశం ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ 2014లో యూపీఏను గెలిపిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, సమాచార హక్కు, ఆహార భద్రత, ఉపాధిహామీ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. 2014 ఎన్నికల్లో యూపీఏ కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిత్‌కుమార్ సింగ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు పడమటి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఇమ్మడి పురుషోత్తం, చంద్రశేఖర్, కృష్ణంరాజు, సాయికేశవ్, నరేష్, సంతోష్, నాగార్జున్పాల్గొన్నారు. -
ఆగని ‘ప్రత్యేక’ హింస
దిఫు/గువాహటి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలంటూ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు హింసకు పాల్పడుతూనే ఉన్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో వివిధ బోడో సంఘాల ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అలాగే దిఫు, దోల్డోలి స్టేషన్ల మధ్య మరోసారి పట్టాలను తొలగించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం శనివారం వరుసగా రెండో రోజు కూడా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కవాతు నిర్వహించింది. మరోవైపు ప్రత్యేక బోడోలాండ్‌ను ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అస్సాంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రాష్ట్రం నుంచి తమ ప్రాంతాన్ని విభజించి కామత్పుర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆల్ కోచ్-రాజ్‌బోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్ శనివారం గవర్నర్ జె.బి. పట్నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాగా, కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో తిరిగి శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పంపిన ఇద్దరు మంత్రులు దిఫు పట్టణం చేరుకొని వివిధ రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులతో చర్చలు చేపట్టారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌ను కేంద్రానికి తెలియజేస్తామని రాజకీయ నేతలకు హామీ ఇచ్చినట్లు అనంతరం వారు విలేకరులకు తెలిపారు. కాగా, అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆందోళనకారుల డిమాండ్లను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శనివారం నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రజలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్తంభించిన డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ర్టంగా ప్రకటించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) శనివారం ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్‌తోపాటు కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, మూతపడ్డాయి. రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డార్జిలింగ్‌కు సమీపంలోని రామమ్, రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో రోజుకు 80-100 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు.