ప్రాణాల మీదకు తెచ్చిన ప్రత్యేక రాష్ట్రం
ఒక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం.. కొన్ని వందల ప్రాణాలను బలిగొంటోంది. డార్జిలింగ్ కొండల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాటం సాగుతుండటంతో అక్కడి టీ తోటల కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆకలి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు టీ ఎస్టేట్లు మూతపడ్డాయి. అనిశ్చిత పరిస్థితి ఉండటం, టీ వేలం పాటలు కొనసాగకపోవడంతో తమ వ్యాపారానికి భరోసా లేదని టీ ఎస్టేట్లను యజమానులు మూసేసుకున్నారు. దాంతో చేయడానికి పని దొరక్క.. అనేక మంది కార్మికులు డొక్క ఎండిపోయి.. ఆకలి చావుల బారిన పడుతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు కారు. రాష్ట్రంకోసం జరుగుతున్న పోరాటం వల్ల ఉపాధి కోల్పోయి మరణించినవాళ్లు.
గతంలో దాదాపు దశాబ్ద కాలం క్రితం పశ్చిమ మిడ్నపూర్ ప్రాంతంలోని ఆమ్లాసోల్లో ఇలాగే ఆకలిచావులు సంభవించినప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. కానీ, నాటి వామపక్ష ప్రభుత్వం, ఇప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం రెండూ కూడా.. ఇవి ఆకలి చావులని గుర్తించడానికి అంగీకరించట్లేదు. గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో దాదాపు వెయ్యిమంది వరకు టీ కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆకలి చావుల బారిన పడ్డారు. ఒకప్పుడు ఎడతెగని డిమాండుతో ఒక వెలుగు వెలిగిన టీ తోటలు ఇప్పుడు మూలపడటంతో ఆర్థికవ్యవస్థ మొత్తం కుప్పకూలుతోంది. అసలే తక్కువ ఆదాయం, తగిన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలతో అతలాకుతలం అవుతున్న టీ కార్మికులకు ప్రస్తుత పరిస్థితి పులిమీద పుట్రలా ఉంది. ఇప్పుడు కనీసం కూలిపని చేద్దామన్నా దొరకట్లేదు.
తినడానికి నాలుగు మెతుకులు కూడా సంపాదించుకోలేని పరిస్థితులు రావడంతో.. చివరకు టీ కార్మికులు తమ పిల్లలను కూడా అమ్ముకుంటున్నారు. చివరకు అమ్ముకోడానికి ఏమీ మిగలని పరిస్థితుల్లో ఆకలిబారిన పడి మరణిస్తున్నారు. పిల్లలైతే కేవలం మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలలకు వెళ్తున్నారు. ఇక్కడున్న కూలీల్లో దాదాపు సగం మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.. ఈలోపు మాత్రం ఉద్యమం వల్ల ఆకలి చావులను చూడాల్సి వస్తోంది!!