ఆ ఆరువేల కోట్ల సరెండర్ నిజమేనా?
నల్లధనంపై మెరుపుదాడి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేశారు. ఈ వార్త ఎంత సంచలనం సృష్టించిందో.. అదేవిధంగా సూరత్ వజ్రాల వ్యాపారి ఏకంగా రూ. ఆరువేల కోట్ల పెద్దనోట్లను కేంద్రానికి స్వాధీనం చేసినట్టు వచ్చిన వార్త కూడా అంతే సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం వల్లే ఒక్కసారిగా ఇది సాధ్యమైందని, ఇదేవిధంగా పెద్దమొత్తంలో నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. కానీ వాస్తవమేమిటంటే..
గత మంగళవారం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన కాసేపటికే వదంతులు షికారు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2వేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉన్నట్టు, దేశంలో పలుచోట్ల పెద్దనోట్ల బ్యాగులను వదిలేసి వెళ్లినట్టు వదంతులు వచ్చాయి. అదేవిధంగా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్ పటేల్ రూ. ఆరువేల కోట్ల పెద్దనోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్ట సంచలన కథనం హల్‌చల్ చేసింది. ఈ లాల్జీభాయ్ గతంలో ప్రధాని మోదీకి రూ. 4.3 కోట్లు విలువచేసే ఖరీదైన సూట్‌ను రూపొందించి ఇచ్చారు. ఈ సూట్‌పై వివాదం రేగడంతో తర్వాత వేలం వేశారు.
దీంతో నిజంగానే ఆయన రూ. ఆరువేల కోట్లు ఇచ్చారేమోనని భావించి స్థానిక మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కానీ తాజాగా లాల్జీభాయ్ మీడియాతో మాట్లాడుతూ తానే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదని, తన గురించి వచ్చిన కథనాలన్నీ బూటకమేనని తేల్చారు. నిజానికి ఇలాంటి వదంతులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. కాబట్టి నిజానిజాలు నిర్ధారించకుండా వీటిని షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.