మరో 12 నెలలు...పెట్టుబడులకు గడ్డుకాలమే!
న్యూఢిల్లీ: భారత్‌లో కంపెనీల పెట్టుబడి వ్యయాలు జోరందుకోవడానికి(రికవరీ) మరో 12 నెలల వ్యవధి పట్టొచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) అభిప్రాయపడింది. ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు వేచిచూసే ధోరణితో ఉండటమే దీనికి కారణమని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ‘రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూడా పెట్టుబడి వ్యయాల క్షీణత కొనసాగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అంత్యంత ప్రకాశవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తున్నప్పటికీ ఈ ప్రతికూల ధోరణి కనబడుతోంది. దేశీ కార్పొరేట్లు కొత్త ప్రాజెక్టులకు ముందుకురావడం లేదు. ముందుగా తమ రుణ భారాన్ని తగ్గించుకొని.. లాభాలను పెంచుకోవడంపై అధికంగా దృష్టిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భార త్‌లో పెట్టుబడుల రికవరీకి ఏడాది కాలం పడుతుం దని భావిస్తున్నాం’ అని ఎస్‌అండ్‌పీ వివరించింది.
2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అగ్రగామి 10 కంపెనీల పెట్టుబడి వ్యయాలు రూ.3.7 లక్షల గరిష్టస్థాయిని తాకాయని నివేదిక పేర్కొంది. తర్వాత రెండేళ్లలో ఈ మొత్తం భారీగా తగ్గుముఖం పడుతోందని తెలిపింది. ‘మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశావహంగానే ఉన్నప్పటికీ.. భారతీయ కార్పొరేట్ల పెట్టుబడులు 2015-16లో 10-15 శాతం మేర క్షీణించనున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు ఫలితాల కోసం కార్పొరేట్లు వేచిచూస్తున్నారు. గతేడాది చివరివరకూ కూడా దేశంలో వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆర్థికపరమైన అనిశ్చితి నెలకొంది. ఇవన్నీ కూడా పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి’ అని ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. అయితే, విస్తృత స్థాయిలో పెట్టుబడి వ్యయాల రికవరీకి ముందు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) పెట్టుబడులు కొంత చేదోడుగా నిలువనున్నాయని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది.