నరమాంసాన్ని వీధుల్లో అమ్మారు
మాస్కో: రష్యా ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో ఒకటి. అలాంటి రష్యా 19వ శతాబ్దంలో కనివినీ ఎరుగని కరువుతో కొట్టుమిట్టాడింది. రష్యన్లు అనుభవించిన ఈ నరకాన్ని 'పొవొల్జై' కరువు అని కూడా పిలుస్తారు. 1917లో రష్యా ఇంచార్జ్ గా లెనిన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆహారంపై ఆంక్షలు విధించారు. దీంతో 1920లో రష్యాలో కీలక నదులైన వోల్గా, ఓరల్ నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. వేలాది మంది ప్రజలు క్షుద్భాద తో ప్రాణాలు విడిచారు.
దాదాపు 2.5 కోట్ల మంది రష్యన్లు ఈ కరువులో ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారని ఓ అంచనా. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యాలో ప్రజా తిరుగుబాటు, కరువు, ప్రభుత్వ అసమర్ధతల వల్ల తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ప్రజలు ఆకలితో చేసిన పనులు గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. గడ్డి, కుక్కలు, పిల్లులు, తోలు వస్తువులు, పశువులను, మానవుల మలాలను కూడా తిన్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే ఏకంగా తమ బిడ్డలను చంపి ఆకలి తీర్చుకున్నారు.
1921 నుంచి 1922 వరకూ సాగిన ఈ దుర్భిక్ష కాలంలో ప్రజలు నరమాంసాన్ని తినేందుకు అలవాటు పడ్డారు. వీధుల్లో నరమాంసాన్ని అమ్మే దుకాణాలు వెలిశాయి. మనుషులను చంపి వారి రక్తమాంసాలను కిలోల చొప్పున అమ్ముతున్నా పోలీసు వ్యవస్ధ, ప్రభుత్వం చూస్తూ ఉండిపోయాయి. ఆనాటి కకావికల దృశ్యాలను కొందరు కెమెరాల్లో బంధించారు. వీధుల్లో నరమాంసం అమ్ముతున్న దంపతులను, చర్మం ఎముకలకు అతుక్కుపోయి అస్థిపంజరాల్లా కనిపిస్తున్న పిల్లలు, వృద్ధులు, మహిళలను ఆ ఫొటోల్లో చూడవచ్చు. అప్పట్లో అవి పత్రికల్లో అచ్చుకావడంతో అమెరికా, కొన్ని యూరోప్ దేశాల ప్రభుత్వాలు స్పందించి వారికి ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించాయి. దీంతో, కొన్ని లక్షల మంది ప్రాణాలు నిలుపుకున్నారు.