రాజకీయ తీర్థం పుచ్చుకున్న ది గ్రేట్ ఖలీ
చండీగఢ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ ఇప్పటినుంచే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పంజాబ్ టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తోంది. పలువురు ప్రముఖులు, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఆప్‌లో చేరుతారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ది గ్రేట్ ఖలీగా పేరొందిన దిలీప్‌సింగ్ రాణా ఆదివారం ఆప్ ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ రెజ్లింగ్ ఆటలో ప్రపంచస్థాయి ఆటగాడిగా కీర్తి సాధించారు. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. ఇటీవల ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన రెజ్లింగ్ షోలో ప్రత్యర్థులను చిత్తుచేసిన ఖలీ.. తన అభిమానులను అలరించాడు.