ఇంటి ముందుకే సూపర్‌ మార్కెట్‌ | The supermarket in front of the house | Sakshi
Sakshi News home page

ఇంటి ముందుకే సూపర్‌ మార్కెట్‌

Published Thu, Jun 15 2017 2:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

ఇంటి ముందుకే సూపర్‌ మార్కెట్‌

ఇంటి ముందుకే సూపర్‌ మార్కెట్‌

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. ఈ సామెతను.. కలిసొచ్చే టెక్నాలజీతో.. నడిచొచ్చే సూపర్‌మార్కెట్‌ అని మార్చుకోవలసిన రోజులు వచ్చేశాయి. చైనాలోని షాంఘై పట్టణ వీధుల్లో సందడి చేస్తోంది ఈ నడిచొచ్చే సూపర్‌మార్కెట్‌. పేరు మొబీ. ఇంట్లోకి సామాన్లు కావాలంటే వీధి చివరి పచారీ కొట్టుకెళ్లడం, సిటీల్లోనైతే కారేసుకుని సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం మనం మామూలుగా చేసే పని. మోబీతో ఇవన్నీ గత కాలపు పనులైపోతాయి. ఎందుకంటే డ్రైవర్‌ అవసరం లేని ఈ వాహనం ఎంచక్కా మీ ఇంటివద్దకే వచ్చేస్తుంది మరి. చేయాల్సిందల్లా.. సరుకులతో నిండిన మోబీలోకి ఎంటరైపోయి కావల్సింది కొనుక్కోవడమే.

స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ సాయంతో మొబీ ఎప్పుడు ఎక్కడ ఉండేదీ ఇట్టే తెలిసిపోతుంది. అయినా.. కష్టపడి స్టోర్‌ దాకా వెళ్లాలా అనుకుంటే  అదే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆర్డరిస్తే చాలు.. మోబీ నుంచి రివ్వున ఎగిరే డ్రోన్‌.. సరుకులను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చేస్తుంది. ఇందుకోసం ఒక్కో మోబీ స్టోర్లో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్‌లు ఉంటాయి. ఈ మొబైల్‌ సూపర్‌ మార్కెట్‌ ఒకవైపు సూర్యుడి శక్తితోనే పనిచేస్తూనే.. గాల్లోని విషతుల్యమైన సూక్ష్మ ధూళి కణాలను కూడా శుభ్రం చేస్తుందట. కృత్రిమ మేధ సాయంతో ఎవరు ఏం కొన్నారు, దానికి బిల్లు ఎంతైందన్న వివరాలను నమోదు చేస్తుంది కూడా.

ఈ మోబీ స్టోర్‌లోకి ఎంటరవగానే... ఓ హాలోగ్రామ్‌ మీకు హలో చెబుతుంది. స్టోర్‌లో ఏవైనా వస్తువులు లేకపోతే.. లేదా మీకు ప్రత్యేకంగా ఏవైనా అవసరముంటే ఈ హాలోగ్రామ్‌కు చెబితే.. తెప్పించి ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. హీఫీ విశ్వవిద్యాలయం, హిమాలయఫై సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొబీ.. సూపర్‌మార్కెట్‌లకు మాత్రమే కాకుండా.. మందుల షాపులుగానూ, ఏటీఎం సెంటర్లగానూ వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. షాంఘైలో ప్రస్తుతం తొలి మొబీ స్టోర్‌ను ప్రయోగాత్మకంగా నడిపి చూస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే త్వరలోనే వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని దీని అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన థామస్‌ మొజెట్టీ అంటున్నారు.     

                                                                                                                                 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement