చనిపోయిన మనిషి బతికొస్తాడట!
టెక్సాస్: చనిపోయిన మనిషిని ఎప్పటికైనా బతికించగలమా? అవుననే అంటున్నారు ఈ దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్న క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు. ఇప్పటికిప్పుడు ప్రాణం పోయిన మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో లేదు. కొన్నేళ్లకైనా సరే, అంటే వందేళ్లకైనా మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి కచ్చితంగా వస్తుందని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆ పరిజ్ఞానమే అందుబాటులోకి వస్తే అప్పుడు చనిపోయిన వారికి మాత్రమే ప్రాణం పోయగలరుగదా! ఈలోగా చనిపోయిన వారి సంగతి ఏమిటీ? ఈ ప్రశ్న కారణంగానే క్రియోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చనిపోయిన వారి మృతదేహాలను కూడా క్రియోనిక్స్ పద్ధతిలో భద్రపరిచినట్లయితే తిరిగి ప్రాణంపోసే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రాణం పోయవచ్చని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇంతకు క్రియోనిక్స్ అంటే ఏమిటీ? ఇది గ్రీక్ పదం. గ్రీక్‌లో క్రియోస్ అంటే శీతలం అని అర్థం. అతిశీతలంలో అంటే, మైనస్ 130 డిగ్రీల నుంచి మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ శీతలీకరణంలో మానవ శరీరాలు, అంగాలను భద్రపర్చడాన్నే క్రియోనిక్స్ అంటాం. మొత్తం మానవ మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల వద్ద, అవయవాలను మైనస్ 130 సెల్సియస్ డిగ్రీల శీతల పరిస్థితుల్లో భద్రపరుస్తారు. చనిపోయిన మనిషిలోని ఏ జన్యువు కూడా దెబ్బతినకుండా ఉండేందుకు శరీరం రక్తనాళాల్లోని రక్తాన్ని వెలికితీసి ఆ స్థానంలో ‘గ్లుటారల్ డిహైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని ఎక్కిస్తారు. దీనివల్ల మానవ మృతదేహంలోని ఏ అణువు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అయితే క్రయోనిక్స్ పద్ధతిలో మానవ దేహాలను భద్రపరిచే ప్రక్రియను మరణించిన కొన్ని క్షణాల్లోనే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో అతిశీతల వాతావరణంలో మానవ శరీరాలను భద్రపర్చినప్పటికీ మంచు పేరుకొని గడ్డకట్టుకుపోవు.
ఇలా క్రయోనిక్స్ పద్ధతిలో మానవ శరీరాలను లేదా తల, గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు లాంటి అవయవాలను భధ్రపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మూడు ల్యాబ్‌లు అమెరికాలో ఉండగా, ఒక ల్యాబ్ రష్యాలో ఉంది. అమెరికాలోని ల్యాబ్‌లు మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 28 వేల డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక అవయవాలను భద్రపర్చేందుకు 12 వేల నుంచి 36 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. 2014లో అమెరికా క్రైయోనిక్స్ ల్యాబుల్లో 250 మంది భద్రపర్చగా మరో 1500 మందిని భద్రపర్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. కేవలం డబ్బుగల వారికే ఈ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటున్నాయి.
ఇప్పుడు అమెరికాలో మరో ల్యాబ్ పుట్టుకొస్తోంది. టెక్సాస్‌లోని కమ్‌ఫర్ట్‌లో వందకుపైగా ఎకరాల సువిశాల ప్రదేశంలో ‘టైమ్‌షిప్ బిల్డింగ్’ పేరిట ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు. పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను, టెర్రరిస్టులుల దాడులను తట్టుకునేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం నేలను చదును చూసే ప్రక్రియ ప్రారంభమైందని, రెండు, మూడు రోజుల్లో పునాదులు పడతాయని దీనికి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీఫెన్ వాలెంటైన్ తెలిపారు. ఈ భవనం పూర్తయితే ఏకంగా 50 వేల మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంచెలంచెలుగా ఎలాంటి ముప్పులేకుండా ఈ భవనానికి పటిష్ట భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ‘న్యూసైంటిస్ట్’ తాజా సంచిక చూడాల్సిందే.
చనిపోయిన మనిషిని బతికించేందుకు పరిశోధనలు 1962లోనే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఎట్టింగస్ 1962లోనే ‘ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ’ అనే పుస్తకం ప్రచురణ ఈ పరిశోధనలకు దారిచూపింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోవున్న ఈ పుస్తకం 2005 పునర్ముద్రణకు నోచుకుంది. డాక్టర్ జేమ్స్ బెడ్‌ఫోర్డ్ అనే వ్యక్తి మృతదేహాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1967లో క్రయోనిక్స్ పద్ధతిలో భద్రపరిచారు. ఆయన మృతదేహం ఇప్పటికీ అమెరికా ల్యాబ్‌లో అలాగే ఉంది.