కల్లోల సిరియాలో సంబురాలు
లటాకియా: బాంబుల మోత.. బుల్లెట్ల వర్షం.. వైమానిక దాడుల్లో కూలిన ఇళ్లు.. రక్తమోడే రహదారులు.. పేదల ఆకలికేకలు.. కల్లోలిత సిరియాలో గడిచిన నాలుగేళ్లుగా కనిపిస్తున్న దృశ్యాలివి. అంతర్యుద్ధం ధాటికి తట్టుకోలేక లక్షలమంది సిరియన్లు మధ్యధర సముద్రం దాటి యూరప్ కు వలసవెళుతున్నారు. అలాంటి దేశంలో చాలా కాలం తర్వాత ప్రజలు ఆడుతూపాడుతూ కనిపించారు!
ఐసిస్ ఉగ్రవాదుల ప్రధాన స్థావరం అలెప్పో నగరానికి కేవలం 110 కిలో మీటర్ల దూరంలోని లటాకియా పట్టణ యువత శనివారమంతా సముద్ర తీరంలో ఆడిపాడి ఎంజాయ్ చేశారు. సిరియా సైన్యం వారం కిందటే లటాకియా పట్టణాన్ని ఉగ్రవాదుల చెరనుంచి విడిపించింది. ఆ సంతోషంలోనే యువత సంబురాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సిరియా తూర్పు ప్రాంతమంతా అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. పశ్చిమ ప్రాంతం మాత్రం ఐసిస్ ఆక్రమించుకుంది. శుక్రవారం ప్రభుత్వ స్వాధీనంలోని మెషద్ పట్టణంలో ఉగ్రవాదులు ఓ టన్నెల్ ను పేల్చిన ఘటనలో 40 మంది సైనికులు మరణించారు. ఇక బుధవారం ఐసిస్ ఆక్రమిత అలెప్పో పట్టణంలో సిరియన్ వైమానిక దళం జరిపిన దాడిలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది చనిపోయారు. ఐసిస్ ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి హస్తగతం చేసుకునే క్రమంలో సైనికులు.. దాదాపు 2 లక్షల మంది పౌరుల్ని తూర్పు ప్రాంతానికి తరలించారు.