నాలుగేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. ఉగ్రమూకల దాడులతో నిరంతరం అల్లకల్లోలంగా ఉండే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. తాజాగా.... ఆధిపత్యపు పోరులో బాల్యం ఎలా శిథిలమవుతుందో తెలిపే ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరియాలో ఐఎస్‌ను రూపుమాపి.. అక్కడి నుంచి తమ దళాలను వెనక్కి రప్పించామని.. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డమాస్కస్, రష్యా సైనికులు మాత్రం నేటికీ సిరియాలో ఉగ్రమూకలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అరిహా పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు స్థానికుల ఇళ్లపై బాంబులతో దాడి చేస్తూ నాలుగు వారాలుగా ఎంతో మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు జరిగిన ఘర్షణలో భాగంగా బుధవారం రాత్రి ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిసింది. ఈ ఘటనలో తల్లి సహా ఓ చిన్నారి మరణించగా.. తండ్రి, ఐదుగురు పిల్లలు భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఉగ్రమూకలకు భయపడి చాలా సేపటి వరకు ఎవరూ వారి దగ్గరకు రాలేదు. ఈ క్రమంలో ఐదేళ్ల రీహమ్ కింద పడుతున్న తన చిన్నారి చెల్లెలు టౌకా(ఏడు నెలలు) షర్టు పట్టుకుని ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు రీహమ్ మరణించగా.. తన చేతుల్లో ఉన్న టౌకా కిందపడిపోయింది. ప్రస్తుతం తండ్రి, ముగ్గురు తోబుట్టువులతో పాటు టౌకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలను బషర్ అల్ షేక్ అనే స్థానిక వార్తా పత్రిక ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. చెల్లెలి ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తున్న రీహమ్ ప్రయత్నం, ఆనక ఆమె మరణించిన తీరు మానవత్వమున్న ప్రతీ ఒక్కరి మనస్సును కదిలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment