
తీపి కొలువుకు... కొత్త పిలుపు
ప్రపంచంలోనే ప్రత్యేక ఆఫర్
లండన్: ఉద్యోగమంటే..ఎంతో కష్టపడాలి. గంటలు లెక్కేయకుండా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. మరోవైపు బాస్‌ను మంచి చేసుకోవాలి. అబ్బో..ఒకటా, రెండా ఎన్నో ఎత్తులు..జిత్తులు.. కాస్త లౌక్యం అవసరం. కానీ ఆ కొలువుకు ఇలాంటివేం అక్కర లేదు. అసలు చెమటోడ్చాల్సిన పనేలేదు. లోకో భిన్నరుచి అన్నట్టుగా కాస్త నాలికకు పదును పెట్టాలి. ఎంచక్కా ఇచ్చిన క్వాంటిటీని లాయించేసి దీని ప్రత్యేకత ఇది సార్..ఇంకాస్త సృజన జోడించి అలా చేస్తే భేషుగ్గా ఉంటుంది అని నాలుగు సలహాలు పడేయాలి. ఇదీ ఆ కొలువుకు ఉన్న అసలు సిసలైన క్వాలిఫికేషన్. ఇంతకీ అదేమిటనేగా మీ సందేహం. ఆ ఉద్యోగ హోదా పేరు ‘చీఫ్ చాక్లెట్ టేస్టర్’ ..ఓ స్కాట్లాండ్ చాక్లెట్ కంపెనీ ఈ కొలువుకు సరైన అభ్యర్థులకోసం అన్వేషిస్తోంది.
ఏడాది కాలంపాటు ఉండే ఈ ఉద్యోగానికి దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు3. అయితే ఈ ఉద్యోగానికి ఎంపికలో ఓ ట్విస్ట్ కూడా ఉంది. కొత్తదనానికి, సృజనకు అభ్యర్థులు పెద్దపీట వేయాలి. ఏ చాక్లెట్ రుచి ఏమిటో ఠక్కున పట్టగలగాలి,వారు ఎలా అర్హులో చెప్పేందుకు నాలుగు చక్కని ఐడియాలు చెప్పాలి. ఆ తర్వాత రెండు జాబితాలు సిద్ధంచేసి అందులోనుంచి వడపోస్తారు. ఆ తర్వాత ప్రతీ ఒక్కరినీ సామాజిక మాధ్యమాల ద్వారా పబ్లిక్ ఓటింగ్‌కోరి ఎంపిక చేస్తారు. ఎంపికయ్యాక ఎంచక్కా చాక్లెట్లు తింటూ ఉద్యోగాన్ని కొనసాగించ వచ్చు. తీపి..తీపిగా ఉద్యోగ జీవితాన్ని గడిపేయొచ్చు.