
మా ఆవిడ మంచి జీతమే ఇస్తుంది: హీరో
దాదాపు దశాబ్దం కిందట ట్వింకిల్ ఖన్నా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. పత్రికల్లో వ్యాసాలు రాస్తూ.. ట్విట్టర్‌లో ఫన్నీ కామెంట్లు పెడుతూ, సొంతంగా వ్యాపారం చేస్తూ బిజీగా గడుపుతున్న ట్వింకిల్ ఖన్నా తాజాగా చేసిన ఓ ప్రకటన చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తాను సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టనున్నట్టు ఆమె తెలిపింది. బాలీవుడ్ సూపర్ స్టార్, భర్త అక్షయ్‌కుమార్‌తోనే ఆమె తొలి సినిమా నిర్మించబోతున్నది. తన భార్య నిర్మాత కాబోతుండటంతో గర్వంగా ఉందని చెప్పిన అక్షయ్ తనదైన స్టైల్‌లో కామెంట్ చేశాడు. ట్వింకిల్ నిర్మాత అయితే, ఆమె తనకు మంచి శాలరీ (జీతం) ఇస్తుందని ఆశిస్తున్నట్టు చమత్కరించాడు.
ఇటీవల ఓ పత్రికతో మాట్లాడిన అక్షయ్ తన భార్య స్వతంత్ర వ్యక్తిత్వం గల వ్యక్తి అని, తన కాళ్లపై తాను నిలబడటానికే ఆమె ప్రాధాన్యమిస్తుందని, ఆమె సామర్థ్యంపై తనకు నమ్మకముందని చెప్పాడు. సినిమాలకు దూరమైనా టీనా (ట్వింకిల్) సొంతంగా కుటుంబ కంపెనీ 'ద ఫార్ అవే ట్రీ'ని, తన కంపెనీ 'ద వైట్ విండో'ని, ఇంటిని ఏకకాలంలో సమర్థంగా నడుపుకొంటు వచ్చిందని ప్రశంసించాడు. రచయితగా, ట్విట్టర్ 'మిసెస్ ఫన్నీబోన్స్'గా పేరొందిన ట్వింకిల్ నిర్మాతగానూ సక్సెస్ అవుతుందని అక్షయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.