వాజపేయితో మోదీ(ఫైల్)
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాజపేయి నాయకత్వ లక్షణాలను ఆయన గుర్తు చేశారు. దేశానికి కీలక సమయంలో అసామాన్య నాయకత్వం అందించిన గొప్ప వ్యక్తి వాజపేయి అని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకుడు, పార్లమెంటేరియన్, మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఆయా పదవులకు వన్నె తెచ్చారని, అదే వాజపేయి ప్రత్యేకత అని ట్వీట్ చేశారు.
ఈ సాయంత్రం ఢిల్లీకి తిరిగిరాగానే వాజపేయి నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనున్నట్టు వెల్లడించారు. రష్యా నుంచి ఈ ఉదయం ప్రధాని మోదీ కాబూల్ చేరుకున్నారు. అఫ్గానిస్థాన్ పార్లమెంట్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కాగా, పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోదీ స్మరించుకున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.