
కారు ముందు సీటులో ప్రాణాలు విడిచిన తనూజ... నుజ్జునుజ్జుయిన కారు
హైదరాబాద్: నగరంలోని ఔటర్ రింగ్ రోడ్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ వైపు నుంచి శేరిలింగంపల్లి వైపు వెళ్తున్న మారుతి ఎస్టీమ్ వాహనం అదుపు తప్పి మీడియం (డివైడర్)ను దాటి వచ్చింది. టోలిచౌకి నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న హోండా సీఆర్వీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారుతి వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సీఆర్వీలోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సైలు శరత్, వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం... శేరిలింగంపల్లి రామయ్యనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ (28) మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్. ఈయన పది రోజుల్లో ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లేందుకు వీసా సైతం తీసుకున్నారు. విజయ్‌కుమార్ బంధువైన గీతారాణి(48) కుమార్తె ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉంటున్నారు. ఆమెకు కొడుకు పుట్టడంతో పట్టుపంచెల కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి విజయ్ తన మారుతీ ఎస్టీమ్ (ఏపీ 9 బీఎం 5752) కారులో గీతారాణితో పాటు బంధువులైన మెదక్ జిల్లా మాచవరానికి చెందిన తనూజ (40), శేరిలింగంపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని పూజ (20)లతో కలిసి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలప్పుడు ఓఆర్‌ఆర్‌పై వెళుతుండగా... హిమాయత్‌సాగర్ సనా ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి మీడియంను ఢీకొట్టింది. పల్టీలు కొట్టి మీడియం దాటి అవతలి వైపు రోడ్డు మీదకు వెళ్లింది.
అదే సమయంలో టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి షఫీ తన హోండా సీఆర్‌వీ (ఏపీ 16 డీబీ 8888) వాహనంలో భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలతో కలిసి శంషాబాద్ వైపు వస్తున్నారు. విజయ్‌కుమార్ వాహనం వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్‌కుమార్‌తో పాటు గీతారాణి, తనూజ అక్కడికక్కడే మరణించగా పూజకు తీవ్ర గాయాలయ్యాయి. హోండా సీఆర్వీకి చెందిన ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది.