పార్లమెంట్ లో టియర్ గ్యాస్ ప్రయోగం!
ప్రిస్టినా: కొసొవో పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సమావేశాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు ఏకంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంట్ లో ఒక్కసారిగా గందరగోళం తలెత్తంది. ఏం జరుగుతుందో తెలియక సభలో ఉన్నవారంతా పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ముగ్గురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొసొవోలోని సెర్బ్ మైనారిటీలకు మరింత స్వయంప్రతిపత్తి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు గత రెండు నెలలుగా పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు టియర్ గ్యాస్ ప్రయోగించి సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎంపీలు హాక్స్ హి శాలా, సామి కుర్తెషిలను అదుపులోకి తీసుకున్నారు.
టియర్ గ్యాస్ గోళాలను పార్లమెంట్ లోకి తెచ్చేందుకు యత్నించిన మరో ఎంపీ పిస్నిక్ ఇస్మాజ్లీను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఎంపీలను పార్లమెంట్ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ బుధవారం కొసొవో పర్యటనకు నేపథ్యంలో పార్లమెంట్ లో చోటుచేసుకున్న ఘటన సంచలనం రేపింది.