
భవనం మీదినుంచి తోసేశారు
డమస్కస్: సిరియాలోని పలు నగరాలను ఆక్రమించుకున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ప్రజలపై తమ పైశాచిక అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హోమ్స్ నగరంలో స్వలింగ సంపర్కులుగా ఆరోపిస్తూ ఇద్దరు యువకుల చేతులను వెనక్కి విరచికట్టి ఓ భవనం పైనుంచి కిందకు తోసేశారు. తర్వాత కొన ఊపిరితోవున్న వారిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ వీడియో దృశ్యాలను శుక్రవారం మధ్యాహ్నం సామాజిక వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి బహిరంగ శిక్షల వీడియోలను విడుదల చేయరాదంటూ ఐఎస్‌ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది తన క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఐదవ రోజే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.
స్వలింగ సంపర్కులను బహిరంగంగా భవనాల మీది నుంచి తోసేయడం, రాళ్లతో కొట్టి చంపడం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు కొత్తేమికాదు. గత ఏప్రిల్ నెలలో ఇద్దరు యువకులను కూడా దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఆ యువకులు ఒకరినొకరు కౌగలించుకున్న ఫొటోను మిత్రులతో తీయించుకున్న కొన్ని నిమిషాల్లోనే వారిని చంపేశారు. జూన్ నెలలో కూడా ముగ్గురు యువకులను ఇదే కారణంతో ఎత్తైన భవనం పైనుంచి తొసేసి చంపేశారు.