తెలుగైతేనే స్పందిస్తారా ?
చెన్నై : అధికార అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి చేరువయ్యే కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణల పర్వం, విమర్శల స్వరం పెంచుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మధ్య పొత్తుకుదిరి సమష్టిగా పోటీకి దిగిన పక్షంలో ఎలా ఎదుర్కొవాలనే అంశంలో అన్ని పార్టీల్లో కంగారు నెలకొంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సాగిన నరేంద్రమోదీ ప్రభంజనాన్ని సైతం నిలువరించి రాష్ట్రంలో అమ్మ జయకేతనం ఎగురవేశారు.
ఏడాది పాలనలో ఎంతో కొంత ప్రతిష్టను మూటగట్టుకున్న బీజేపీ... అమ్మతో కలిసి అసెంబ్లీకి తలపడితే బలీయమైన శక్తిగా అవతరించగలదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఆస్తుల కేసులో జయ జైలుపాలు కావడాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రయోగించాలని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. అయితే ఆమె నిర్దోషిగా బైటపడడంతో సదరు అస్త్రాన్ని అటకెక్కించక తప్పలేదు. ప్రతిపక్షాలకు ఇక మిగిలింది అమ్మ కేబినెట్. అమ్మ కేబినెట్ అవినీతిమయం అంటే జయ ప్రభుత్వం అక్రమాలమయం అని చెప్పక చెప్పినట్లే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
అమ్మ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలంటే అవినీతి ఆరోపణలు ఒక్కటే మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ తలపోశారు. అమ్మ కేబినెట్‌లోని మంత్రులు భారీ అవినీతి పరులను ఆరోపిస్తూ గవర్నర్ రోశయ్యకు గత ఏడాది వినతిపత్రం సమర్పించారు. అంతేగాక మంత్రుల అవినీతి వివరాలతో కూడిన జాబితాను సమర్పించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తమిళ మంత్రులపై తాము చేసిన ఆరోపణలు గవర్నర్ బంగ్లాలో బుట్టదాఖలైనాయని వారు కలవరపడుతున్నారు. కులమతాలు, భాషా భేదాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే హోదాలో ఉన్న రోశయ్య మాతృభాషైన తెలుగును ఇళంగోవన్ ప్రస్తావిస్తూ పరుషపూరితమైన వ్యాఖ్యానాలు చేశారు.
చెన్నై సత్యమూర్తి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇళంగోవన్ మాట్లాడుతూ, తమిళ మంత్రులు పాల్పడుతున్న అవినీతి చిట్టాను రాష్ట్రగవర్నర్ కే రోశయ్యకు సమర్పించి ఎనిమిది నెలలు అవుతోంది, ఆ చిట్టా ఏమైందో ఇంత వరకు తెలియలేదని అన్నారు.
ఆ అవినీతి చిట్టాను ఆంగ్లం, తమిళంలో ఇచ్చాము, ఒకవేళ రోశయ్యకు తెలుగులో రాసిస్తేనే అర్థం అయ్యేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులపై మరో అవినీతి చిట్టాను సిద్ధం చేసేందుకు తాను ఎటువంటి జాప్యానికి పాల్పడటం లేదని అన్నారు.