E. V. K. S. Elangovan
-
తెలుగైతేనే స్పందిస్తారా ?
చెన్నై : అధికార అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి చేరువయ్యే కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణల పర్వం, విమర్శల స్వరం పెంచుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మధ్య పొత్తుకుదిరి సమష్టిగా పోటీకి దిగిన పక్షంలో ఎలా ఎదుర్కొవాలనే అంశంలో అన్ని పార్టీల్లో కంగారు నెలకొంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సాగిన నరేంద్రమోదీ ప్రభంజనాన్ని సైతం నిలువరించి రాష్ట్రంలో అమ్మ జయకేతనం ఎగురవేశారు. ఏడాది పాలనలో ఎంతో కొంత ప్రతిష్టను మూటగట్టుకున్న బీజేపీ... అమ్మతో కలిసి అసెంబ్లీకి తలపడితే బలీయమైన శక్తిగా అవతరించగలదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఆస్తుల కేసులో జయ జైలుపాలు కావడాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రయోగించాలని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. అయితే ఆమె నిర్దోషిగా బైటపడడంతో సదరు అస్త్రాన్ని అటకెక్కించక తప్పలేదు. ప్రతిపక్షాలకు ఇక మిగిలింది అమ్మ కేబినెట్. అమ్మ కేబినెట్ అవినీతిమయం అంటే జయ ప్రభుత్వం అక్రమాలమయం అని చెప్పక చెప్పినట్లే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అమ్మ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలంటే అవినీతి ఆరోపణలు ఒక్కటే మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ తలపోశారు. అమ్మ కేబినెట్లోని మంత్రులు భారీ అవినీతి పరులను ఆరోపిస్తూ గవర్నర్ రోశయ్యకు గత ఏడాది వినతిపత్రం సమర్పించారు. అంతేగాక మంత్రుల అవినీతి వివరాలతో కూడిన జాబితాను సమర్పించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమిళ మంత్రులపై తాము చేసిన ఆరోపణలు గవర్నర్ బంగ్లాలో బుట్టదాఖలైనాయని వారు కలవరపడుతున్నారు. కులమతాలు, భాషా భేదాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే హోదాలో ఉన్న రోశయ్య మాతృభాషైన తెలుగును ఇళంగోవన్ ప్రస్తావిస్తూ పరుషపూరితమైన వ్యాఖ్యానాలు చేశారు. చెన్నై సత్యమూర్తి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇళంగోవన్ మాట్లాడుతూ, తమిళ మంత్రులు పాల్పడుతున్న అవినీతి చిట్టాను రాష్ట్రగవర్నర్ కే రోశయ్యకు సమర్పించి ఎనిమిది నెలలు అవుతోంది, ఆ చిట్టా ఏమైందో ఇంత వరకు తెలియలేదని అన్నారు. ఆ అవినీతి చిట్టాను ఆంగ్లం, తమిళంలో ఇచ్చాము, ఒకవేళ రోశయ్యకు తెలుగులో రాసిస్తేనే అర్థం అయ్యేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులపై మరో అవినీతి చిట్టాను సిద్ధం చేసేందుకు తాను ఎటువంటి జాప్యానికి పాల్పడటం లేదని అన్నారు. -
కాంగ్రెస్సా.. మజాకా
ప్రభుత్వంలో చోటు ఇచ్చే వారికే తమ మద్దతు అధికారంలోకి రాకుండానే పంపకాలు రాహుల్ సభ సన్నాహ ఏర్పాట్లలో సన్నాయి నొక్కులు చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆలూ లేదూ.చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనకటికి ఒకడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథ సారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యవహారం అచ్చం ఆ సామెతలా ఉంది. కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చే పార్టీ ప్రభుత్వంలో సమాన భాగస్వామ్యం ఇవ్వాల్సిందేనని రాష్ట్ర అధ్యక్షుల వారు నొక్కివక్కాణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగు ఐదు దశాబ్దాల క్రితమే కాలం చెల్లిపోయింది. కామరాజనాడార్ 1963లో ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిన తరువాత కాంగ్రెస్‌కు గడ్డుకాలాన్నే వెళ్లదీస్తోంది. అన్నాడీఎంకే, లేదా డీఎంకేలతో పొత్తుపెట్టుకుని కొద్దిపాటి స్థానాలను గెలుస్తూ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఆ దశ నుండి సైతం దిగజారిపోయింది. 2011లో అన్నాడీఎంకే ప్రభుత్వం వచ్చేవరకు వరుసగా రెండు టర్మ్‌లు డీఎంకే అధికారంలో ఉంది. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకేలు మిత్రపక్షాలుగా పోటీచేశాయి. ఆ పదేళ్ల కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయి ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేతో కలిసిపోటీ చేయాలని కాంగ్రెస్ తహతహలాడినా కరుణానిధి దూరంగా పెట్టారు. విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌లు ఒక్కసీటు గెలవకపోగా డిపాజిట్లు కోల్పోయాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బలమైన శక్తిగా మారి అన్ని ఎన్నికల్లో అజేయంగా నిలవడంతో విపక్షాలన్నీ ఏకం కాకతప్పడంలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రానుండగా, ప్రతిపక్షాలన్నీ ఎవరికివారు మద్దతు కూడగట్ట పనిలో మునిగిపోయారు. బీజేపీ గొడుగు కింద ఉన్న డీఎండీకే మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఏకాకిగానే ఉన్నాయి. కండిషన్ల కాంగ్రెస్ ః గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మద్దతు కోసం అన్ని పార్టీలవైపు చేయిచాచి విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నాడీఎంకేతో ఎలాగూ కుదరదు కాబట్టి డీఎంకేపై దృష్టిపెట్టింది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సమయం, సందర్భం చిక్కినపుడల్లా డీఎంకేతో సంభాషణ లు కలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో డీఎంకే కాదుపొమ్మన్నా అప్పటి కారణాలు వేరంటూ సర్దిచెబుతున్నారు. అంతాబాగున్నా అన్నిపార్టీలకు కాంగ్రెస్ ముందుగానే కండీషన్లు పెట్టడం నవ్వులు పూయిస్తోంది. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులను ఎదుర్కొన్నా ప్రజల్లో అన్నాడీఎంకే ప్రాభవం ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఎన్నికల్లో అన్నాడీఎంకేను తూర్పారబట్టేందుకు ప్రతిపక్షాల వద్ద సరైన అస్త్రమే లేదు. వచ్చే ఏడాది సైతం జయలలితకే జయమనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటూనే అధికారంలోకి వస్తే సమభాగస్వామ్యం డిమాండ్ చేస్తామని ఇళంగోవన్ చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన తిరుచ్చిలో రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఇటవల మధురైలో సమీకరణ సన్నాహాలు సాగాయి. మధురై సభలో ఇళంగోవన్ మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌పై కుర్చీవేసి కూర్చుంటే ఇక ఒప్పుకోము. మా మద్దతుతో గెలిచిన పార్టీ నేత ముఖ్యమంత్రి అయితే మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆర్దిక మంత్రి వారు తీసుకుంటే హోం మంత్రి మాకు ఇవ్వాలి. అన్ని చోట్లా వారి కుర్చీ పక్కనే మాకు కుర్చీ ఉండాలి’ మిత్రపక్ష పార్టీకి కండీషన్లు పెట్టారు. రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు కూడగట్టేందుకు రాహుల్ గాంధీనానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ పేరు చెబితే ప్రజలే కాదు రాష్ట్రంలోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు సైతం అమడదూరం జరుగుతున్నాయి. ఇంతటి దుర్భరపరిస్థితుల్లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇళంగోవన్ పెడుతున్న కండిషన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. -
పన్నీరు ప్రభుత్వం త్వరలో డిస్మిస్
సాక్షి, చెన్నై: మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ జోస్యం చెప్పారు. మంత్రుల అవినీతి బండారాలతో కూడిన ఆధారాల చిట్టా తమ చేతిలో ఉందని ధీమా వ్యక్తం చే శారు. దీనిని రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించగానే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని పేర్కొన్నారు. టీఎంసీ అంటే ఏమిటి...అలాంటి పార్టీ రాష్ట్రంలో ఉందా..? అని ఎద్దేవా చేశారు. నాగర్ కోవిల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు అయింది. దీనిని ఈవీకేఎస్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈవీకేఎస్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై, తమిల మానిల కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకు పోయిందని ఆరోపించారు. సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులందరూ అవినీతి పరులేనని పేర్కొంటూ, అందుకు తగ్గ ఆధారాల చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలతో చిట్టా సిద్ధం అయిందని, దీనిని గవర్నర్‌కు సమర్పించబోతున్నామన్నారు. ఆధారాల చిట్టా గవర్నర్ చేతికి అందగానే, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని జోస్యం చెప్పారు. జాలర్ల జీవనాధారం మీద ప్రభావం చూపించే మీనాకుమారి కమిషన్సిఫారసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లకు నిషేదం కాలంలో కంటి తుడుపు చర్యగా రూ. రెండు వేలు నివారణ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, రూ. ఐదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిషేద కాలంలో జాలర్లకు రూ. 5500గా నిర్ణయించి ఉన్నదని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో సాగుతున్నదని అసమర్థ పాలన అని, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల సంక్షేమం మీద కన్నా, విదేశీ పర్యటనల మీదే మోజు ఎక్కువగా ఉందని విమర్శించారు. మణిముత్తారు నీటిని సక్రమంగా విడుదల చేయని దృష్ట్యా, తిరునల్వేలి, తూత్తుకుడిల్లోని అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కొక్ కంపెని తమను స్థలం అడగ లేదని, అనుమతి కోసం సంప్రదించ లేదని మంత్రి తోపు వెంకటా చలం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థకు ఇచ్చిన అనుమతుల్ని ఏ విధంగా రద్దు చేశారో వివరించాలని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన తోపు వెంకటాచలం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, జికే వాసన్నేతృత్వంలోని తమిల మానిల కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ గురించి ప్రస్తావిస్తూ, టీఎంసీ రాష్ట్రంలో ఉందా..? దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కాంగ్రెస్‌కు ఉందని, తాము రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, తమ మద్దతుతోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఎవరితోనన్నది ఎన్నికల సమయంలో తెలుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రుల అవినీతి, రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలు, నేరాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాల్ని ఉధృతం చేయనున్నామన్నారు. -
సయోధ్య కుదిరేనా?
టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వర్గీయుల మధ్య సయోధ్య కుదిరేనా..? అన్న ఎదురు చూపులు పెరిగాయి. శుక్రవారం సత్యమూర్తి భవన్ వేదికగా చిదంబరం వర్గీయులు ప్రత్యేక సమావేశానికి పిలుపు నిచ్చారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఎప్పుడు ఏ ఏ గ్రూపుల మధ్య వివాదాలు చెలరేగుతాయోనన్నది చెప్పలేం. ఈ గ్రూపుల పుణ్యమా ప్రసుత్తం రాష్ర్టంలో పతనం అంచున కాంగ్రెస్ చేరి ఉన్నది. పార్టీకి కొత్త గాలి నింపే విధంగా టీఎన్‌సీసీ బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఏఐసీసీ అప్పగించినా, గ్రూపుల తన్నులాట మాత్రం ఆగలేదు. ఇక, ఏకంగా ఈవీకేఎస్‌తో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గీయులు ఢీ కొట్టే పనిలో పడ్డారు. మాటల యుద్ధం ఈ రెండు గ్రూపుల మధ్య తారాస్థాయికి చేరి ఏఐసీసీ పెద్దలు పంచాయితీ పెట్టక తప్పలేదు. ఈ పంచాయతీలు ఓ వైపు సాగుతున్నా, మరో వైపు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అదే సమయంలో వాసన్ టీఎంసీని ఏర్పాటు చేసుకున్నట్టుగా, చిదంబరం సైతం కొత్త కుంపటి పెట్టబోతున్నారన్న ప్రచారం బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో సామరస్య పూర్వకంగా అందరూ కలసి మెలసి వెళ్లాలని అధిష్టానం ఆదేశించి ఉండటంతో చిదంబరం వర్గం కాస్త తగ్గినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. సయోద్య కుదిరేనా: ఇన్నాళ్లు సత్యమూర్తి భవన్లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకుండా, హోటళ్లల్లో జరుపుకుంటూ వచ్చిన చిదంబరం మద్దతు దారులు, తాజాగా సత్యమూర్తి భవన్‌ను వేదికగా చేసుకునేందుకు రెడీ అయ్యారు. రాష్ర్టంలోని జిల్లా పార్టీల అధ్యక్షులుగా, ఇతర పదవుల్లో, రాష్ట్ర కమిటీల్లో ఉన్న తమ మద్దతు దారులందరూ తప్పకుండా ఈ సమావేశానికి రావాలన్న ఆదేశాలను ఏఐసీసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆదేశాలు జారీ చేసి ఉండటం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా, గ్రూపులకు అతీతం గా అందరూ కలసి కట్టుగా పనిచేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చిదంబరం మద్దతు దారుడు ఒకరు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాల అనంతరం పార్టీ బలోపేతం కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో కలసి మెలసి పనిచేసే విధంగా ముందు కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ సారి సత్యమూర్తి భవన్ వేదికగా సమావేశం నిర్వహించి, తామూ కాంగ్రెస్ శ్రేణులమేనని చాటుకునే పనిలో పడ్డట్టు పేర్కొనడం గమనార్హం. -
కాబోయే సీఎం కుష్బు
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో కుష్బు సెలబ్రెటీ అయ్యారు. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను ప్రకటించిన వెంటనే నాయకులు పలాన పదవికి అంటే, పలాన పదవికి ఆమె అర్హురాలు అని ఊకదంపుడు ప్రసంగాలతో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. నిన్న మొన్నటి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుష్బును మంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడ్డా కుష్బు మంత్రి కావడం తథ్యమని ప్రకటించేశారు. ఈ ప్రకటన వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు మాత్రం కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా అక్కడి నాయకులు కాబోయే సీఎం కుష్బు అని నినదిస్తూ, సీఎం పదవికి ఆమె అర్హు రాలిగా ప్రకటిస్తూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టాన్ని మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే సర్కారు వైఖరిని ఎండగడుతూ తిరుచ్చిలోని అన్నా విగ్రహం వేదికగా సోమవా రం సాయంత్రం నిరసన సభ జరిగింది. ఈ నిరసనకు కుష్బు నేతృత్వం వహించా రు. ఇందులో ప్రసంగించిన ఆ జిల్లా పార్టీ నాయకులు ఆరోగ్య రాజ్, వేలు స్వామి తదితరులు కుష్బును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మద్దతు దారులకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో చిదంబరానికి మద్దతు గా నినాదాలు అందుకోవడం, మరి కొం దరు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో నిరసనలో గందరగోళం చోటు చేసుకుంది. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా చిదంబరం వర్గీయులు నినాదాలు చేయడంతో తామింతే అన్నట్టుగా గ్రూపు తగదా రాజుకుంది. చివరకు పోలీ సులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. అనంతరం నిరసనను ఉద్దేశించి కుష్బు ప్రసంగిస్తూ, కేసుల నుంచి బయట పడేందుకే భూ సేకరణ చట్టానికి అన్నాడీఎంకే మద్దతు ప్రకటిం చిందని ఆరోపించారు. కేంద్రం తీరును ఎండగట్టే రీతిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనూ కుష్బు సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత మీడియా కుష్బు ను కదలించింది. తమరిని కాబోయే సీఎంగా పేర్కొంటున్నారే, ఆ పదవికీ తమరు అన్ని రకాల అర్హులుగా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని, వాటన్నింటినీ పరిగణించాల్సిన అవసరం లేదని ముందుకు సాగారు. కుష్బుకు హోదా: ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండా తన సేవల్ని పార్టీకి అందిస్తూ వచ్చిన నటి కుష్బును కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆమెను ఏఐసీసీలో అందలం ఎక్కించేలా చేసిందని చెప్పవచ్చు. సమస్యలపై స్పందించే విధానం, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం, రాజకీయ అవగాహన వెరసి కుష్బుకు ఏఐసీసీలో చోటు దక్కేలా చేశాయి. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 17 మంది ఏఐసీసీ అధికార ప్రతినిధుల జాబితాలో కుష్బుకు ఆరో స్థానం దక్కడం విశేషం. జాతీయ అధికార ప్రతినిధిగా తమిళనాడుకు చెంది న కుష్బు పేరును మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. కుష్బుకు పదవి దక్కడంతో పార్టీలో దూసుకెళ్లడం ఖాయం. ఆమెకు మద్దతు దారుల సంఖ్య పెరగడం ఖాయం. అదే సమయంలో కొత్త నినాదం మరింతగా ప్రచారంలోకి రానుండడం గమనార్హం. -
కుష్బుకు పదవి ఖాయం
కాంగ్రెస్‌లో అడుగు పెట్టిన కుష్బు త్వరలో మంత్రి కాబోతున్నారట. ఇదేదో సినిమా షూటింగ్ మాత్రం కాదు. ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశలో రాష్ర్ట కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా అధికార పగ్గాలు చేపట్టగానే ఆమెకు కేబినెట్లో పదవి గ్యారంటీ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై : డీఎంకే కుటుంబ రాజకీయాల్ని తట్టుకోలేక, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి కుష్బు ఇటీవల అడుగు పెట్టారు. ఆమె ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. తమ ప్రాంతానికి కంటే తమ ప్రాంతానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించి మరీ సభలను కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ ఓ వైపు కసరత్తుల్లో ఉంటే, మరో వైపు ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశల పల్లకిలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ ఊగిసలాడుతున్నట్టున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం చేపడితే, కుష్బు మంత్రి కావడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. అరుంబాక్కంలో కాంగ్రెస్ నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో సాగిన ఆసక్తికర ప్రసంగాలు విన్న వారిని విస్మయంలో పడేశాయి. కుష్బు తన ప్రసంగంలో అన్నాడీఎంకే సర్కారు తీరును ఎండగట్టారు. డీఎంకే హయాంలో విద్యుత్ కోతలు పెరిగాయంటూ అన్నాడీఎంకేకు అధికార పగ్గాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ విషయానికి వస్తే మిస్డ్ కాల్ రూపంలో రోజుకు లక్షల మందిని చేర్పించేస్తున్నామని డప్పులు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రోజుకు లక్షల మంది సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు శ్రీరంగంలో ఐదు వేల ఓట్లే వచ్చాయి ఎందుకో? అని ప్రశ్నించారు. ప్రజల సీఎం...ప్రజల సీఎం అని డప్పులు వాయించుకున్న వాళ్లకు కనీసం సిగ్గు కూడా లేదని విమర్శించారు. ప్రజా సీఎం కామరాజర్ మాత్రమేనన్నది ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని హితవు పలికారు. జైలు శిక్ష పడ్డ వాళ్లను ప్రజా సీఎం .. అని సంబోధిస్తుండడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తాము అధికారంలోకి రావడంలో ఎలాంటి మార్పు లేదని, తప్పకుండా వస్తామని స్పష్టం చేశారు. కుష్భు ప్రసంగం అనంతరం మైకు అందుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెను పొగడ్తల పన్నీరులో ముంచారు. ఆమె రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం ఆవహించిందన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అన్నం తినడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, అందుకే శ్రీరంగం ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని పాలకుల శకం ఇక ముగిసినట్టేన్నారు. ప్రజల్లో ఆ రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత బయలుదేరిందని పేర్కొన్నారు. కుష్బు చెబుతున్నట్టుగా 2016లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అధికారంలోకి రాగానే, మంత్రి వర్గంలో ఆమెకు చోటు ఖాయం అని స్పష్టం చేశారు. ఆమె మంత్రి కావడంలో ఎలాంటి మార్పు లేదని, ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగాల్ని ఆసక్తికరంగా నోళ్లు ఎల్లబెట్టిన కాంగ్రెస్ వర్గాలు చివరకు ఈవీకేఎస్ సినీ భక్తికి అవధులు లే కుండాపోయాయని పెదవి విప్పారు. మరి కొందరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా కుష్భును ప్రకటించేస్తారేమోనన్నట్టుగా వ్యాఖ్యానించడం గమనార్హం.