కాంగ్రెస్సా.. మజాకా
- ప్రభుత్వంలో చోటు ఇచ్చే వారికే తమ మద్దతు
- అధికారంలోకి రాకుండానే పంపకాలు
- రాహుల్ సభ సన్నాహ ఏర్పాట్లలో సన్నాయి నొక్కులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆలూ లేదూ.చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనకటికి ఒకడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథ సారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యవహారం అచ్చం ఆ సామెతలా ఉంది. కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చే పార్టీ ప్రభుత్వంలో సమాన భాగస్వామ్యం ఇవ్వాల్సిందేనని రాష్ట్ర అధ్యక్షుల వారు నొక్కివక్కాణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగు ఐదు దశాబ్దాల క్రితమే కాలం చెల్లిపోయింది. కామరాజనాడార్ 1963లో ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిన తరువాత కాంగ్రెస్‌కు గడ్డుకాలాన్నే వెళ్లదీస్తోంది. అన్నాడీఎంకే, లేదా డీఎంకేలతో పొత్తుపెట్టుకుని కొద్దిపాటి స్థానాలను గెలుస్తూ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఆ దశ నుండి సైతం దిగజారిపోయింది. 2011లో అన్నాడీఎంకే ప్రభుత్వం వచ్చేవరకు వరుసగా రెండు టర్మ్‌లు డీఎంకే అధికారంలో ఉంది.
ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకేలు మిత్రపక్షాలుగా పోటీచేశాయి. ఆ పదేళ్ల కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయి ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేతో కలిసిపోటీ చేయాలని కాంగ్రెస్ తహతహలాడినా కరుణానిధి దూరంగా పెట్టారు. విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌లు ఒక్కసీటు గెలవకపోగా డిపాజిట్లు కోల్పోయాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బలమైన శక్తిగా మారి అన్ని ఎన్నికల్లో అజేయంగా నిలవడంతో విపక్షాలన్నీ ఏకం కాకతప్పడంలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రానుండగా, ప్రతిపక్షాలన్నీ ఎవరికివారు మద్దతు కూడగట్ట పనిలో మునిగిపోయారు. బీజేపీ గొడుగు కింద ఉన్న డీఎండీకే మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఏకాకిగానే ఉన్నాయి.
కండిషన్ల కాంగ్రెస్ ః గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మద్దతు కోసం అన్ని పార్టీలవైపు చేయిచాచి విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నాడీఎంకేతో ఎలాగూ కుదరదు కాబట్టి డీఎంకేపై దృష్టిపెట్టింది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సమయం, సందర్భం చిక్కినపుడల్లా డీఎంకేతో సంభాషణ లు కలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో డీఎంకే కాదుపొమ్మన్నా అప్పటి కారణాలు వేరంటూ సర్దిచెబుతున్నారు. అంతాబాగున్నా అన్నిపార్టీలకు కాంగ్రెస్ ముందుగానే కండీషన్లు పెట్టడం నవ్వులు పూయిస్తోంది. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులను ఎదుర్కొన్నా ప్రజల్లో అన్నాడీఎంకే ప్రాభవం ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఎన్నికల్లో అన్నాడీఎంకేను తూర్పారబట్టేందుకు ప్రతిపక్షాల వద్ద సరైన అస్త్రమే లేదు.
వచ్చే ఏడాది సైతం జయలలితకే జయమనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటూనే అధికారంలోకి వస్తే సమభాగస్వామ్యం డిమాండ్ చేస్తామని ఇళంగోవన్ చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన తిరుచ్చిలో రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఇటవల మధురైలో సమీకరణ సన్నాహాలు సాగాయి. మధురై సభలో ఇళంగోవన్ మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌పై కుర్చీవేసి కూర్చుంటే ఇక ఒప్పుకోము. మా మద్దతుతో గెలిచిన పార్టీ నేత ముఖ్యమంత్రి అయితే మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆర్దిక మంత్రి వారు తీసుకుంటే హోం మంత్రి మాకు ఇవ్వాలి. అన్ని చోట్లా వారి కుర్చీ పక్కనే మాకు కుర్చీ ఉండాలి’ మిత్రపక్ష పార్టీకి కండీషన్లు పెట్టారు. రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు కూడగట్టేందుకు రాహుల్ గాంధీనానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ పేరు చెబితే ప్రజలే కాదు రాష్ట్రంలోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు సైతం అమడదూరం జరుగుతున్నాయి. ఇంతటి దుర్భరపరిస్థితుల్లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇళంగోవన్ పెడుతున్న కండిషన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి.