కుష్బుకు పదవి ఖాయం
కాంగ్రెస్‌లో అడుగు పెట్టిన కుష్బు త్వరలో మంత్రి కాబోతున్నారట. ఇదేదో సినిమా షూటింగ్ మాత్రం కాదు. ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశలో రాష్ర్ట కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా అధికార పగ్గాలు చేపట్టగానే ఆమెకు కేబినెట్‌లో పదవి గ్యారంటీ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ స్పష్టం చేశారు.
సాక్షి, చెన్నై : డీఎంకే కుటుంబ రాజకీయాల్ని తట్టుకోలేక, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి కుష్బు ఇటీవల అడుగు పెట్టారు. ఆమె ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. తమ ప్రాంతానికి కంటే తమ ప్రాంతానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించి మరీ సభలను కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ ఓ వైపు కసరత్తుల్లో ఉంటే, మరో వైపు ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశల పల్లకిలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ ఊగిసలాడుతున్నట్టున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం చేపడితే, కుష్బు మంత్రి కావడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. అరుంబాక్కంలో కాంగ్రెస్ నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో సాగిన ఆసక్తికర ప్రసంగాలు విన్న వారిని విస్మయంలో పడేశాయి.
కుష్బు తన ప్రసంగంలో అన్నాడీఎంకే సర్కారు తీరును ఎండగట్టారు. డీఎంకే హయాంలో విద్యుత్ కోతలు పెరిగాయంటూ అన్నాడీఎంకేకు అధికార పగ్గాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ విషయానికి వస్తే మిస్డ్ కాల్ రూపంలో రోజుకు లక్షల మందిని చేర్పించేస్తున్నామని డప్పులు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రోజుకు లక్షల మంది సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు శ్రీరంగంలో ఐదు వేల ఓట్లే వచ్చాయి ఎందుకో? అని ప్రశ్నించారు. ప్రజల సీఎం...ప్రజల సీఎం అని డప్పులు వాయించుకున్న వాళ్లకు కనీసం సిగ్గు కూడా లేదని విమర్శించారు. ప్రజా సీఎం కామరాజర్ మాత్రమేనన్నది ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని హితవు పలికారు. జైలు శిక్ష పడ్డ వాళ్లను ప్రజా సీఎం .. అని సంబోధిస్తుండడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
తాము అధికారంలోకి రావడంలో ఎలాంటి మార్పు లేదని, తప్పకుండా వస్తామని స్పష్టం చేశారు. కుష్భు ప్రసంగం అనంతరం మైకు అందుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెను పొగడ్తల పన్నీరులో ముంచారు. ఆమె రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం ఆవహించిందన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అన్నం తినడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, అందుకే శ్రీరంగం ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని పాలకుల శకం ఇక ముగిసినట్టేన్నారు. ప్రజల్లో ఆ రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత బయలుదేరిందని పేర్కొన్నారు. కుష్బు చెబుతున్నట్టుగా 2016లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
అధికారంలోకి రాగానే, మంత్రి వర్గంలో ఆమెకు చోటు ఖాయం అని స్పష్టం చేశారు. ఆమె మంత్రి కావడంలో ఎలాంటి మార్పు లేదని, ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగాల్ని ఆసక్తికరంగా నోళ్లు ఎల్లబెట్టిన కాంగ్రెస్ వర్గాలు చివరకు ఈవీకేఎస్ సినీ భక్తికి అవధులు లే కుండాపోయాయని పెదవి విప్పారు. మరి కొందరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా కుష్భును ప్రకటించేస్తారేమోనన్నట్టుగా వ్యాఖ్యానించడం గమనార్హం.