సాక్షి, చెన్నై: మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ జోస్యం చెప్పారు. మంత్రుల అవినీతి బండారాలతో కూడిన ఆధారాల చిట్టా తమ చేతిలో ఉందని ధీమా వ్యక్తం చే శారు. దీనిని రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించగానే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని పేర్కొన్నారు. టీఎంసీ అంటే ఏమిటి...అలాంటి పార్టీ రాష్ట్రంలో ఉందా..? అని ఎద్దేవా చేశారు. నాగర్ కోవిల్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు అయింది. దీనిని ఈవీకేఎస్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈవీకేఎస్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై, తమిల మానిల కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకు పోయిందని ఆరోపించారు.
సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులందరూ అవినీతి పరులేనని పేర్కొంటూ, అందుకు తగ్గ ఆధారాల చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలతో చిట్టా సిద్ధం అయిందని, దీనిని గవర్నర్‌కు సమర్పించబోతున్నామన్నారు. ఆధారాల చిట్టా గవర్నర్ చేతికి అందగానే, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని జోస్యం చెప్పారు. జాలర్ల జీవనాధారం మీద ప్రభావం చూపించే మీనాకుమారి కమిషన్‌సిఫారసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లకు నిషేదం కాలంలో కంటి తుడుపు చర్యగా రూ. రెండు వేలు నివారణ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, రూ. ఐదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిషేద కాలంలో జాలర్లకు రూ. 5500గా నిర్ణయించి ఉన్నదని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో సాగుతున్నదని అసమర్థ పాలన అని, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల సంక్షేమం మీద కన్నా, విదేశీ పర్యటనల మీదే మోజు ఎక్కువగా ఉందని విమర్శించారు. మణిముత్తారు నీటిని సక్రమంగా విడుదల చేయని దృష్ట్యా, తిరునల్వేలి, తూత్తుకుడిల్లోని అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కొక్ కంపెని తమను స్థలం అడగ లేదని, అనుమతి కోసం సంప్రదించ లేదని మంత్రి తోపు వెంకటా చలం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థకు ఇచ్చిన అనుమతుల్ని ఏ విధంగా రద్దు చేశారో వివరించాలని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన తోపు వెంకటాచలం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, జికే వాసన్‌నేతృత్వంలోని తమిల మానిల కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ గురించి ప్రస్తావిస్తూ, టీఎంసీ రాష్ట్రంలో ఉందా..? దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కాంగ్రెస్‌కు ఉందని, తాము రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, తమ మద్దతుతోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఎవరితోనన్నది ఎన్నికల సమయంలో తెలుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రుల అవినీతి, రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలు, నేరాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాల్ని ఉధృతం చేయనున్నామన్నారు.
పన్నీరు ప్రభుత్వం త్వరలో డిస్మిస్
Published Fri, Apr 24 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement