నా చెల్లిని కాపాడుకోలేకపోయా..
వెల్దుర్తి : అభం..శుభం తెలియని 16 మంది చిన్నారులను బలిగొన్న మాసాయిపేట రైలు దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, కిష్టాపూర్, గుండ్రెడిపల్లి, ఇస్లాం పూర్ గ్రామాలకు చెందిన మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కన్నీటితో నివాళులర్పించారు. పిల్లల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.
చిన్నారుల చిత్రపటాలను చూస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో అంతా చలించిపోయారు. మొదట గ్రామ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ఇంచార్జ్ యాదగిరిలతో పాటు స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పాఠశాల నుంచి సంఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వెల్దుర్తి : పట్టాలపై బస్సు ఆగిపోయింది. మృత్యువు రూపంలో రైలు దూసుకురాగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరిని రక్షించింది విద్యార్థిని రుచిత. తమ్ముడు వరుణ్‌గౌడ్, చెల్లి శృతి తో కలిసి ప్రయాణిస్తున్న రుచిత స్కూల్ బస్సు రైలు పట్టాలపై ఆగిపోయిన వెంటనే బస్సులోని సద్భావనదాసు, మహిపాల్‌రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికిలో నుంచి బయటకు తోసివేసింది. తన తమ్ముడు వరుణ్‌గౌడ్‌ను కూడా బయటకు తోసివేసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు.. ఇంతలోనే మృత్యు శకటం బస్సును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రుచిత రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది.
వరుణ్‌గౌడ్ నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడగా రుచిత చెల్లి శృతి ప్రమాదంలో మృతి చెంది. ఇద్దరు పిల్లలను రక్షించిన నేను నా చెల్లిని కాపాడుకోలేకపోయానంటూ కంటతడి పెట్టింది రుచిత. నా సాహసాన్ని గుర్తించిన సాక్షి టీవీ యాజమాన్యం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తాత వద్దకు తీసుకువెళ్లింది. తాతా మా వైద్యం కోసం కొంత డబ్బు ఇచ్చాడంటూ తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. కాగా ఇద్దరు చిన్నారులను కాపాడిన రుచితకు సాహస బాలిక అవార్డు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.