musaipeta train accident
-
మానని గాయానికి ఐదేళ్లు...
సాక్షి, తూప్రాన్: ఐదేళ్ల క్రితం తూప్రాన్ మండలంలోని మూసాయి పేట రైల్వే గేటు స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ సంఘటన ఇప్పటికీ కళ్లముందు మెదలుతూనే ఉంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు వారి జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు. కొంత మంది తమ పిల్లల విగ్రహాలను వ్యవసాయ పొలాల్లో ప్రతిష్టించుకొని వారితో గడిపిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో సరిగ్గా ఐదేళ్లు. ఐదేళ్ల క్రితం రోజులాగే తెల్లారింది. ఏప్పటిలాగే ఆ చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్‌కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు.. అటుగా వస్తున్న నాందెడ్ ప్యాసింజర్ రైలు.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తునాతునకలైంది. అందులోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ రైలు పట్టాల పక్కన ఎగిరిపడ్డారు. బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్‌తో పాటు 14 మంది చిన్నారులు సంఘటన స్థలంలో మృతిచెందారు. మరో 20 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మొత్తం 16మంది చిన్నారులు రైలు ప్రమాదంలో విగత జీవులయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జూలై 24న జరిగిన రైలు ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లవుతుంది. మృతులంతా తూప్రాన్ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు వారే. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది. బస్సులో ఉన్న ప్రతి విద్యార్థికీ ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్Œ బాక్స్‌ల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కనిపించాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇప్పటికీ చిన్నారుల తల్లిదండ్రుల కళ్లల్లో నీటి సుడులు తిరుగుతూనే ఉన్నాయి.. మసాయిపేట రైలు ప్రమాదం జరిగి ఐదేళ్లు గడిచిన ఇంకా వారి మదిలోంచి చిన్నారుల జ్ఞాపకాలు చెదిరిపోలేదు. వారి మధుర జ్ఞాపకాలతోనే కాలం వెల్లదిస్తున్నారు. ఎదిగిన కొడుకును మరిచిపోలేక ఓ బాధిత కుంటుంబం కుమారుడి ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలా బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పో యి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదిస్తున్నారు. స్మృతివనం ఏర్పాటయ్యేనా..! వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామ శివారులోని రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన చిన్నారుల జ్ఞాపకార్థం అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు మృతుల కుటుంబాలను పరమార్శించి ఓదార్చిన అనంతరం ప్రమాదం జరిగిన చోట మృతుల ఆత్మశాంతికి స్కృతివనం నిర్మిస్తామని హామీనిచ్చారు. కాని ఐదేళ్లు కావస్తున్న హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా నాయకులు స్పందించి స్మృతివనం ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. -
తీరని కడుపుకోత
చిట్టిపొట్టి మాటలతో స్కూల్ బ్యాగులు వేసుకొని అమ్మ.. నాన్న బై.. అంటూ పాఠశాలకు బయలుదేరిన పిల్లలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారో..? లేదో..? అన్న భయం ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంటోంది. కొన్నేళ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం... సంగారెడ్డి క్రైం: సరైన శిక్షణ నైపుణ్యం కలిగిన డ్రైవర్లనే ఎంచుకొని ప్రైవేట్ పాఠశాలల బస్సులను నడిపేందుకు నియమించుకోవాలి. లాభపేక్షతో యాజమాన్యాలు తక్కువ వేతనంతో పని చేస్తే వారిని నియమించుకుంటున్నాయి. సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో బస్పులు నడపడం కూడా మరో కారణం. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్వాది చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన సంఘటనలో హత్నూర మండలానికి చెందిన విద్యార్థులు గాయపడిన సంగతి విదితమే. కొన్నేళ్ల క్రితం జూలై 24న వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వేగేటు వద్ద పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 16 మంది విద్యార్థులు, డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా.. మరో 18 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన మారుమూల ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో చీకట్లను నింపింది. నేటికీ పాలకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుణపాఠం నేర్చుకోలేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం రోజురోజుకు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మౌలిక వసతులు లేకపోయినా... శిక్షణ,అర్హత లేని వారితో ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించడం పరిపాటైంది. ఏటా రవాణా శాఖ అధికారులు పాఠశాలల ప్రారంభ సమయంలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను ‘మమ’ అనిపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణపై అధికారులు పర్యవేక్షించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిట్నెస్ పరీక్షల సమయంలో మాత్రం బ్యాడ్జ్ నెంబర్ కలిగిన డ్రైవర్లతో అనుమతి పొందుతున్నారు. తర్వాత యథావిధిగా బ్యాడ్జ్ నెంబర్, అనుభవం లేనివారితో నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నా చెల్లిని కాపాడుకోలేకపోయా..
వెల్దుర్తి : అభం..శుభం తెలియని 16 మంది చిన్నారులను బలిగొన్న మాసాయిపేట రైలు దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, కిష్టాపూర్, గుండ్రెడిపల్లి, ఇస్లాం పూర్ గ్రామాలకు చెందిన మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కన్నీటితో నివాళులర్పించారు. పిల్లల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. చిన్నారుల చిత్రపటాలను చూస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో అంతా చలించిపోయారు. మొదట గ్రామ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ఇంచార్జ్ యాదగిరిలతో పాటు స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పాఠశాల నుంచి సంఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెల్దుర్తి : పట్టాలపై బస్సు ఆగిపోయింది. మృత్యువు రూపంలో రైలు దూసుకురాగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరిని రక్షించింది విద్యార్థిని రుచిత. తమ్ముడు వరుణ్‌గౌడ్, చెల్లి శృతి తో కలిసి ప్రయాణిస్తున్న రుచిత స్కూల్ బస్సు రైలు పట్టాలపై ఆగిపోయిన వెంటనే బస్సులోని సద్భావనదాసు, మహిపాల్‌రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికిలో నుంచి బయటకు తోసివేసింది. తన తమ్ముడు వరుణ్గౌడ్ను కూడా బయటకు తోసివేసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు.. ఇంతలోనే మృత్యు శకటం బస్సును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రుచిత రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. వరుణ్‌గౌడ్ నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడగా రుచిత చెల్లి శృతి ప్రమాదంలో మృతి చెంది. ఇద్దరు పిల్లలను రక్షించిన నేను నా చెల్లిని కాపాడుకోలేకపోయానంటూ కంటతడి పెట్టింది రుచిత. నా సాహసాన్ని గుర్తించిన సాక్షి టీవీ యాజమాన్యం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తాత వద్దకు తీసుకువెళ్లింది. తాతా మా వైద్యం కోసం కొంత డబ్బు ఇచ్చాడంటూ తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. కాగా ఇద్దరు చిన్నారులను కాపాడిన రుచితకు సాహస బాలిక అవార్డు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.