మానని గాయానికి ఐదేళ్లు... | Five Years Completed After Masaipet Train Mishap | Sakshi
Sakshi News home page

మానని గాయానికి ఐదేళ్లు...

Published Wed, Jul 24 2019 8:53 AM | Last Updated on Wed, Jul 24 2019 8:53 AM

Five Years Completed After Masaipet Train Mishap - Sakshi

స్మృతివనం ఏర్పాటు చేస్తామన్న ఘటనా స్థలం

సాక్షి, తూప్రాన్‌: ఐదేళ్ల క్రితం తూప్రాన్‌ మండలంలోని మూసాయి పేట రైల్వే గేటు స్కూల్‌ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది విద్యార్థులు మృతిచెందారు.  ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ సంఘటన ఇప్పటికీ కళ్లముందు మెదలుతూనే ఉంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు వారి జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు. కొంత మంది తమ పిల్లల విగ్రహాలను వ్యవసాయ పొలాల్లో ప్రతిష్టించుకొని వారితో గడిపిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.

రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో సరిగ్గా ఐదేళ్లు. ఐదేళ్ల క్రితం రోజులాగే తెల్లారింది. ఏప్పటిలాగే ఆ చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్‌కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు.. అటుగా వస్తున్న నాందెడ్‌ ప్యాసింజర్‌ రైలు.. స్కూల్‌ బస్సును ఢీ కొట్టింది. కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తునాతునకలైంది. అందులోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ రైలు పట్టాల పక్కన ఎగిరిపడ్డారు.

బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్‌తో పాటు 14 మంది చిన్నారులు సంఘటన స్థలంలో మృతిచెందారు. మరో 20 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మొత్తం 16మంది చిన్నారులు రైలు ప్రమాదంలో విగత జీవులయ్యారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జూలై 24న జరిగిన రైలు ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లవుతుంది. మృతులంతా తూప్రాన్‌ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్‌ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు వారే.

ఈ ఘటనతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్‌ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది.  బస్సులో ఉన్న ప్రతి విద్యార్థికీ ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్‌ బాక్స్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్‌Œ బాక్స్‌ల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కనిపించాయి.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇప్పటికీ చిన్నారుల తల్లిదండ్రుల కళ్లల్లో నీటి సుడులు తిరుగుతూనే ఉన్నాయి.. మసాయిపేట రైలు ప్రమాదం జరిగి ఐదేళ్లు గడిచిన ఇంకా వారి మదిలోంచి చిన్నారుల జ్ఞాపకాలు చెదిరిపోలేదు. వారి మధుర జ్ఞాపకాలతోనే కాలం వెల్లదిస్తున్నారు. ఎదిగిన కొడుకును మరిచిపోలేక ఓ బాధిత కుంటుంబం కుమారుడి ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలా బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పో యి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదిస్తున్నారు. 

స్మృతివనం ఏర్పాటయ్యేనా..!
వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామ శివారులోని రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన చిన్నారుల జ్ఞాపకార్థం అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు మృతుల కుటుంబాలను పరమార్శించి ఓదార్చిన అనంతరం ప్రమాదం జరిగిన చోట మృతుల ఆత్మశాంతికి స్కృతివనం నిర్మిస్తామని హామీనిచ్చారు. కాని ఐదేళ్లు కావస్తున్న హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా నాయకులు స్పందించి స్మృతివనం ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement