
నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపడుతున్నారు. ఆగస్టు 24 నుంచి 28 వరకు జిల్లాలో ఐదు రోజుల పాటు ఆమె తొలి దశ పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు.
తొలి దశలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటన ఉంటుంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న అకాల మరణం పొందడం తెలిసిందే. ఈ ఘోరాన్ని తట్టుకోలేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 77 మంది చనిపోయారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద జననేత వైఎస్ జగన్ ఇచ్చిన మాటను ఆచరణలో చూపేందుకు జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. తొలి రోజు సోమవారం జనగామ నియోజకవర్గం చేర్యాలలో బస్వగల్ల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి ఆదేశానుసారం పార్టీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర ఏర్పాట్ల్లు చేశారు.
తొలి రోజు ఏడు కుటుంబాలు: సోమవారం ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గ ంటలకు యాత్రకు బయలుదేరతారు. రాజీవ్ రహదారి మార్గంలో వరంగల్ జిల్లా కొమురవెల్లి మీదుగా 11గంటలకు చేర్యాల చేరుకుంటారు. మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని, అనంతరం మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి, బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశి కంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్, బండనాగారంలో మానెపల్లి సిద్ధులు, కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు, అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాలను పరామర్శిస్తారు.
జనం గుండెల్లో వైఎస్ కుటుంబం: రాఘవరెడ్డి
కాజీపేట రూరల్: డాక్టర్ వైఎస్ కుటుంబసభ్యులు ప్రజల గుండెల్లో ఉన్నారని, వారినెవరూ వేరు చేయలేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. షర్మిల యాత్ర సందర్భంగా హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించిన సందర్భంగా అశేష ప్రజాదరణ లభించిందని గుర్తు చేశారు. వైఎస్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలందాయని వైఎస్సార్‌సీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం. విలియం, సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ భేటీలో పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ...
⇒ 24న జనగామ సెగ్మెంట్‌లో 7కుటుంబాలకు పరామర్శ
⇒ 25న జనగామ సెగ్మెంట్‌లో మూడు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 4 కుటుంబాలకు పరామర్శ
⇒ 26న స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో రెండు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ
⇒ 27న వరంగల్ పశ్చిమ ఒకటి, తూర్పు నాలుగు, పరకాల సెగ్మెంట్‌లో రెండు కుటుంబాలకు పరామర్శ
⇒ 28న పరకాల ఒకటి, వర్ధన్నపేట రెండు, పాలకుర్తి నియోజకవర్గంలో ఒక కుటుంబానికి పరామర్శ