ఏపీ తాత్కాలిక సచివాలయం: వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ నేడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:59కి ముహూర్తం ఖరారు. తొలుత పంచాయితీ రాజ్, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్యాశాఖలను వెలగపూడికి తరలించాలని సర్కారు నిర్ణయం.
తెలంగాణలో న్యాయమూర్తుల నిరసన: ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్లు కల్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. ఆప్షన్ల ఉపసంహరణ, ప్రత్యేక హైకోర్టు, 11 మంది జడ్జీలపై సస్సెంన్షన్ ఎత్తివేతను డిమాండ్ చేస్తూ నేటి జడ్జీలు సామూహిక సెలవులపై వెళ్లనున్నారు. 15 రోజులపాటు విధులకు దూరంగా ఉండి తమ నిరసన తెలియజేస్తారు.
టీఆర్ఎస్ పీపీ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారు. కీలకమైన హైకోర్టు విభజన అంశంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు, సాగు నీటి ప్రాజెక్టులపై నేతలు చర్చిస్తారు.
కేంద్ర కేబినెట్ సమావేశం: ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ జరగనుంది.
క్షిపణి పరీక్ష: భారత్- ఇజ్రాయెల్ లు సంయుక్తంగా రూపొందించిన క్షిపణిని నేడు ప్రయోగించనున్నారు. క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం పొందిన తర్వాత భారత్ చేపడుతోన్న మొదటి క్షిపణి పరీక్ష ఇది.
సీసీపీఏ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో నేడు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) భేటీ జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
సింగపూర్ కు కేటీఆర్: సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నేడు సింగపూర్ వెళ్లనున్నారు.
బెల్లంపల్లి బంద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నేడు బంద్ కు పిలుపునిచ్చింది.
నేటి ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు
తెలుగు టైటాన్స్ X జైపూర్ పింక్ పాంథర్స్
యు ముంబా X పట్నా పైరేట్స్