
నేడు పోలియో చుక్కల మందు పంపిణీ
రాష్ర్టవ్యాప్తంగా 27 వేల కేంద్రాల్లో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందును పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 27 వేల కేంద్రాల్లో పోలియో చుక్కల మందు వేయనున్నారు. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకెళ్లి పోలియో చుక్కలు చేయించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం తెలియక మందు వేయించనివారికోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బందే ఇంటింటికి రానున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లోని చిన్నారుల కోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఆ రోజు సిబ్బంది ఇళ్లకు వెళ్లి చిన్నారుల వివరాలు తెలుసుకుని తొలి మూడు రోజుల్లో డ్రాప్స్ వేయని వారికి ప్రత్యేకంగా మందు పంపిణీ చేయనున్నారు. ఈ నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు వయసున్న 42 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1.25 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున హైదరాబాద్‌లో పోలియో చుక్కలు వేసే ప్రారంభ కార్యక్రమంలో మంత్రులెవరూ పాల్గొనటం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ కార్యక్రమాన్ని ఉదయం ఎనిమిది గంటలకు కుందన్‌బాగ్‌లో ప్రారంభించనున్నారు.