
మహిళలు దేశాధిపతులైతే..శాంతియుత ప్రపంచం!
చెన్నై: అసమ్మతి గళాలను కూడా గౌరవించాల్సిన అవసరముందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. అన్నిమత విశ్వాసాలనే కాదు.. ఏ మతవిశ్వాసం లేనివారిని కూడా గౌరవించడమే లౌకికవాదమని ఆయన అన్నారు. దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 'మీతో ఏకీభవించనివారిని నిర్మూలించాలనుకోవడం సరికాదు' అని చెప్పారు.
'ప్రపంచ శాంతికి మానవ దృక్కోణం' అనే అంశంపై మద్రాస్ ఐఐటీలో దలైలామా మంగళవారం ఉపన్యసించారు. గడిచిన శతాబ్దమంతా హింసతో నిండిపోయిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగడం మూర్ఖత్వమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచంలోని ఏడు వందల కోట్ల జనాభాలో వందకోట్లమంది వరకు మత అవిశ్వాసులు ఉన్నారు. వారిని కూడా గౌరవించాల్సిన అవసరముంది. ఎందుకంటే మత విశ్వాసం అనేది ఒకరి వ్యక్తిగత విషయం' అని చెప్పారు. మతసామరస్యంలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శప్రాయమని కొనియాడారు. తదుపరి దలైలామ మహిళ అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు తప్పకుండా అవ్వొచ్చు అని బదులిచ్చారు. 'నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఆమె అందంగా ఉండాలి. ఎందుకంటే ముఖం కూడా కొంత మార్పును తీసుకురాగలదు! కాదంటారా?' అని నవ్వుతూ చెప్పారు. మహిళలు దేశాధిపతులైతే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుందని దలైలామా అభిప్రాయపడ్డారు.