రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.. పూర్తివివరాలు
- ఔటర్ ప్రమాదంలో స్పాట్‌డెడ్.. మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఆలస్యం
- ఉస్మానియా మార్చురీ నుంచి నేరుగా అంత్యక్రియలకు
- అమెరికాలో భరత్ సతీమణి.. పిల్లలు లేరు
- పోస్ట్‌మార్టం రిపోర్టులు వస్తే మిగతా విషయాలు తేలతాయన్న డీసీపీ
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్‌ఆర్) కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన భరత్ సినీ హీరో రవితేజ సోదరుడని గుర్తించడానికీ చాలా సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ... పోస్టుమార్టం పరీక్షల రిపోర్ట్ వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
వివాహితుడైన భరత్ రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా... ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్ళారు. ఈ మేరకు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చాలా సేపటి వరకు అక్కడి గదిలో ఉన్న భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు.
రిఫ్లెక్టివ్ క్రోన్స్‌ను దాటి లారీని ఢీ కొట్టి...
ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న లోడ్‌తో కూడిన లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ లారీ (ఏపీ 16 టీవై 3167) బ్రేక్‌డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ రాజ్ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకు వెళ్ళి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది.
ఈ ప్రమాదం ధాటికి కారు దాదాపు సగం వరకు లారీ కిందికి చొచ్చుకుపోయి నజ్జునుజ్జయింది. కారు ముందు టైరు... లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో కారు గంటకు 145 కిమీ వేగంతో దూసుకువచ్చినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకుకోవడంతో అవి ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండని సమాధానం!
ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న భరత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భూపతి భరత్ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు కొన్ని నెంబర్లకు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నెంబర్‌కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా... ‘ఆస్పత్రికి తీసుకువెళ్ళండి’ అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో దీనిపై రెండు ఈ–చలాన్లు (రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ సొసైటీ, అన్నపూర్ణ చౌరస్తాల్లోని క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు బంజారాహిల్స్, శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీటిని జారీ చేశారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్‌వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. అతడు మంచి బౌలర్ అయి పలువురు చెప్తున్నారు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి.