ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు?
న్యూయార్క్: అన్నింటా మగవాళ్లతో సమాన హక్కులు కోరుతున్న మహిళలు ఆదివారం నాడు చిత్రమైన డిమాండ్‌తో ముందుకొచ్చారు. నెక్కరు తప్ప బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి అచ్చాదన లేకుండా మగవాడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు తాము మాత్రం ‘నిపుల్స్ ఫ్రీ’గా ఎలాంటి అచ్చాదన లేకుండా ఎందుకు తిరగకూడదని సవాల్ చేశారు. చేయడమే కాదు, బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి ఆహార్యం లేకుండా వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. పలు వీధులు తిరుగుతూ తమ కొత్త హక్కుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందులో పిల్లల నుంచి బామ్మల వరకు పాల్గొనగా, పురుషులు కూడా వారికి మద్దతుగా నెక్కరు తప్ప ఏమీ లేకుండా వారి వెంట వీధుల్లో నడిచారు. ‘మీ స్వేచ్ఛకు మేము అడ్డు కాదు’ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.
ఇలాంటి ప్రదర్శనలు ఒక్క అమెరికా నగరాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో జరిగాయి. న్యూయార్క్ సిటీలో మాత్రం మరింత ఆకర్షణగా జరిగాయి. ఎక్కడ తిరిగినా ఫర్వాలేదుగానీ ‘టైమ్ స్క్వేర్’కు మాత్రం రావద్దంటూ స్థానిక మేయర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. 1992 నుంచే ‘టాప్‌లెస్’గా న్యూయార్క్ నగరంలో మహిళలు తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు ఓ ఉద్యమంగా నిర్వహించడం మాత్రం తమకు నచ్చలేదని న్యూయార్క్ మేయర్ బిల్ దే బాసియో, పోలీసు కమిషనర్ బిల్ బ్రాటన్ వ్యాఖ్యానించారు. ఈ టాప్‌లెస్ మహిళలు ఆఖరికి వాషింఘ్టన్ డీసీలో దేశాధ్యక్ష భవనాన్ని కూడా వదిలిపెట్టారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉన్న కారణంగా భావప్రకటనా స్వేచ్ఛ కింద మచ్చుకు లిబర్టీ విగ్రహంలా టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు.
అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ‘టాప్‌లెస్’ నిరసనకు హాలీవుడ్ తార, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చారు. ‘గో టాప్‌లెస్’, ‘నిపుల్ ఫ్రీ’ పేరిట ఆమె ఇచ్చిన పిలుపుకు ప్రపంచంలోని 60 నగరాల్లో మహిళలు స్పందించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. న్యూయార్క్ సిటీతోపాటు మన్‌హట్టన్, ఎడెన్‌బర్గ్ లాంటి అమెరికా నగరాల్లోనే ఎక్కువ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లతోపాటు తమకు టాప్‌లెస్ హక్కులు ఉండాలని రాచెల్ జెస్సీ డిమాండ్ చేశారు. మగవాళ్లతో పోలిస్తే తాము అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నామని, మొదట తాము తమ శరీర భాగాలకు స్వేచ్ఛను కలిగించాలని కోరుకుంటున్నామని, అలా చేయడం వల్ల మెదడు కూడా స్వేచ్ఛగా ఫీలవుతుందని ఆమె అన్నారు.