పాముతో ఆటలు ప్రాణం తీసింది
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ పాములోడు చేసిన పనికి పాపం ఓ పర్యాటకుడు అన్యాయంగా మరణించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ పాములోడు పాములతో విన్యాసాలు ప్రారంభించారు. దాన్ని చూట్టం కోసం జోధ్‌పూర్‌కు వచ్చిన పర్యాటకులు ఆయన చుట్టూ మూగారు. కొందరేమో సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు.
వారిలో పాములాటను ఆసక్తిగా చూస్తున్న ఓ యువకుడి మెడలో ఆ పాములోడు ఓ నాగు పామును దండలా వేయబోయాడు. చిర్రెత్తుకొచ్చిన పాము పర్యాటకుడిని ఎవరూ గుర్తించలేనంత వేగంగా కరచింది. కాసేపటికి అనుమానం వచ్చిన పర్యాటకుడు తనను పాము కరచిందేమో అంటూ ఆపాములోడికి తన కణతను చూపించాడు. దాన్ని పాములోడు అసలు పట్టించుకోలేదు. కాసేపటికి స్మహతప్పిపోతున్న పర్యాటకుడిని స్థానికులు ఆస్పత్రికి కాకుండా సమీపంలో ఉన్న ఓ మందుల షాపుకు తీసుకెళ్లారు. గంటలోపే ఆ పర్యాటకుడు చనిపోయాడు.
పాములోడి వద్దనున్న నాగుపాము ఏ రకమైనదో ఎవరికి తెలియదు. భారత దేశంలో ఐదు రకాల నాగుపాములు అత్యంత విషపూరితమైనవి. అవి కరిస్తే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. వాటిలో ఇండియన్ కోబ్రా ఒకటి.