ఫేస్‌బుక్‌లో ట్రెండవుతున్న ఎస్ఐ.. ఎందుకు?
ఫేస్‌బుక్‌లో ట్రెండవుతున్న ఎస్ఐ.. ఎందుకు?
Published Tue, Jan 10 2017 5:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
ఆయన ఢిల్లీ పోలీసుశాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైరయిపోతారు కూడా. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా.. దాదాపు రూ. 50 వేల విలువైన నగదు ఉన్న తన వాలెట్ పోగొట్టుకున్న ఓ వ్యాపారవేత్త.. దాన్ని తిరిగిచ్చిన ఎస్ఐ మదన్ సింగ్ గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అంతే, పోలీసులలో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ ఒక్కసారిగా ఆ పోస్టుకు లైకులు, షేర్లు వెల్లువెత్తాయి. కేవలం ఆ పర్సు తిరిగివ్వడమే కాదు, సదరు వ్యాపారి తనకు బహుమతిగా ఇవ్వబోయిన 5వేల రూపాయలను కూడా మదన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు.
ఈనెల ఏడోతేదీ ఉదయం 9.30 గంటల సమయంలో జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలోని నిజాముద్దీన్ బ్రిడ్జి సమీపంలో తన పర్సు పోగొట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ కాలనీ నుంచి ప్రీత్‌విహార్ లోని తన ఇంటికి వెళ్తుండగా కారు ఆగిపోయింది. కారును స్టార్ట్ చేయడానికి తోయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పర్సు పడిపోయింది. రాత్రి 10.30 గంటలకు ఇంటికి వెళ్లి చూసుకోగా పర్సు లేదు.
ఇంతలో రోడ్డుమీద వెళ్తున్న ఓ సైక్లిస్టు ఆ పర్సు తీసుకుని వెళ్తుండటాన్ని మదన్ సింగ్ చూశారు. అతడిని వెంబడించి పట్టుకుని, పర్సు తీసుకున్నారు. అందులో చాలా పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, విజిటింగ్ కార్డులు ఉన్నాయి. అందులో విజిటింగ్ కార్డు మీద నెంబరు చూసి జగ్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు.
ఆ ఫోన్ వచ్చే సమయానికి కారు మొత్తం గాలించిన జగ్రీత్.. ఇక పర్సు దొరకదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇంతలో మదన్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో.. పర్సులో కేవలం తన ఐడెంటిటీ కార్డు మాత్రమే ఉండి ఉండొచ్చని, డబ్బులు ఉండకపోవచ్చని అనుకున్నారు. తీరా ఆక్కడకు వెళ్లి చూస్తే.. మొత్తం డబ్బు యథాతథంగా ఉంది. తాను కేవలం డ్రైవింగ్ లైసెన్సు మాత్రమే చూశానని, తర్వాత విజిటింగ్ కార్డు చూసి ఫోన్ చేశానని మదన్ సింగ్ చెప్పారు. అలాంటి నిజాయితీపరుడైన పోలీసును ఇంతవరకు చూడలేదని, చివరకు ఫొటో తీయించుకోడానికి కూడా ఒప్పుకోలేదని అన్నారు.
మదన్ సింగ్ తమ శాఖకే గర్వకారణమని ట్రాఫిక్ డీసీపీ డీకే గుప్తా అన్నారు. అతడికి శాఖాపరంగా తగిన రివార్డు ఇప్పిస్తామని, ఇతరులు కూడా ఆయనను చూసి స్ఫూర్తి పొందాలని చెప్పారు. అల్వార్‌కు చెందిన మదన్ సింగ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. కొడుకులిద్దరిలో ఒకరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుండగా మరొకరు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement