
కొచ్చి: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే.. సోషల్ మీడియా ఊరుకోవట్లేదు. సామాజిక మాధ్యమాల సాయంతో జనాలు ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ ట్రాఫిక్ పోలీస్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది.
మార్నింగ్ వాక్ కోసం ఏకంగా ఓ రోడ్డునే బ్లాక్ చేయించాడు ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారి. కొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్) వినోద్ పిళ్లై.. క్వీన్స్‌వాక్‌వేలోని రోడ్డును మూయించేసి మరీ మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ రోడ్డు ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసేయాలి. అయితే మిగతా రోజుల్లోనూ ఉదయం పూట ఆ రోడ్డును మూయించి.. మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై.
అంతేకాదు ఆయన వాకింగ్ చేస్తున్నంత సేపు సిబ్బంది ట్రాఫిక్ డైవర్షన్ బాధ్యతలు చూసుకునేవాళ్లు. ఈయన దెబ్బకు పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించడానికి.. రోడ్డుకు మరోవైపు దాదాపు అర కిలోమీటర్ దూరం దాకా వెళ్లాల్సి వచ్చింది పేరెంట్స్. మూడు రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికులు.. చిర్రెత్తుకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులతో నిరసనలు వ్యక్తం చేశారు.
దీంతో విషయం పైఅధికారుల దృష్టికి చేరింది. దీంతో వినోద్ పిళ్లైకి షో కాజ్ నోటీసు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. కుక్క ఈవెనింగ్ వాక్ కోసమని కోసమని స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఘటనపై.. ఢిల్లీలో ఓ ఐఏఎస్ కపుల్‌ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment