న్యూఢిల్లీ: ఆరు నెలల్లోగా దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) అమలు చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికం సేవల కంపెనీలకు సూచించింది. ఎంఎన్‌పీ సదుపాయం వల్ల.. వేరే టెలికం సంస్థకు మారినా కూడా పాత నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం ఇది మొబైల్ వినియోగదారు.. సేవలు పొందుతున్న సర్వీసు ఏరియాకి మాత్రమే పరిమితమవుతోంది. తాజాగా దీన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం వల్ల లెసైన్సు సర్వీసు ఏరియాతో (ఎల్‌ఎస్‌ఏ) సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ సబ్‌స్క్రయిబర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినా.. అక్కడ మళ్లీ కొత్తగా నంబరు తీసుకోనక్కర్లేదు.
తన పాత నంబరునే అక్కడి స్థానిక టెలికం సర్వీసు ప్రొవైడరుకు బదలాయించుకుని మొబైల్ సేవలు పొందవచ్చు. ఎంఎన్‌పీతో ముడిపడి ఉన్న వర్గాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ట్రాయ్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రస్తుత ఎంఎన్‌పీ సర్వీస్ లెసైన్సు నిబంధనల్లో అవసరమైన మార్పులను చేయాలని టెలికం విభాగానికి (డాట్) ట్రాయ్ సూచించింది. ఎంఎన్‌పీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత... డయల్ చేసే నంబరుకు ముందు తప్పనిసరిగా ప్లస్ 91ని జోడించే విధంగా సబ్‌స్క్రయిబర్లలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇది ప్రామాణిక ఫార్మాట్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా కాల్స్ కనెక్ట్ కాగలవని వివరించింది. ఎస్‌టీడీ కాల్ చార్జీలు దాదాపు లోకల్ కాల్ రేట్ల స్థాయికి తగ్గిపోయినందువల్ల .. ఎస్‌టీడీ చార్జీలు ఎవరు భరించాల్సి ఉంటుందన్నది పెద్ద సమస్య కాబోదని ట్రాయ్ అభిప్రాయపడింది.
6 నెలల్లో పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
Published Thu, Sep 26 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement